Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cervical Cancer: కొత్తగా వస్తున్న వ్యాక్సీన్‌తో గర్భాశయ క్యాన్సర్‌‌ను పూర్తిగా తగ్గించవచ్చా?

Cervical Cancer
, సోమవారం, 18 జులై 2022 (16:38 IST)
క్యాన్సర్ అనగానే పెద్ద పేగు క్యాన్సర్‌తో 43 ఏళ్లకే చనిపోయిన అక్క, వయసు మీరకుండానే బోన్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పెద్దమ్మ గుర్తొస్తారు. ఈ మధ్యనే 40లలో ఉన్న నా డాక్టర్ స్నేహితురాలు క్యాన్సర్ బారిన పడి మరణించిన విషయం పదే పదే గుర్తుకొస్తూనే ఉంటుంది. డాక్టర్ అయినప్పటికీ తనను తాను క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోలేకపోయింది.


మరొక స్నేహితురాలికి సర్వైకల్ క్యాన్సర్ అని తేలింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో కీమోథెరపీ చేయించుకుంటూ, చికిత్స పొందుతున్నారు. ఆఫీసులో ఒక కొలీగ్ కూడా క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. నా స్నేహితుల్లోనే కొందరు క్యాన్సర్ చికిత్స తీసుకుని తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. క్యాన్సర్‌ను జయించామని చెప్పేవారు ఉన్నప్పటికీ, ఈ రోగం బారిన పడి మరణించిన వారిని, లేదా చికిత్స తీసుకుంటూ అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని కూడా చాలా దగ్గరగా చూస్తూనే ఉన్నాం.

 
క్యాన్సర్ గురించి విన్న ప్రతి సారీ, ఇంత మంది క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారు? దీనికి నివారణ లేదా? ఇది ఎవరికైనా రావచ్చా? క్యాన్సర్ సోకితే మరణించాల్సిందేనా లాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్‌ (గర్భాశయ క్యాన్సర్) రూపుమాపేందుకు దేశీయంగా తయారయ్యే హెచ్‌పీవీ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్త చూడగానే, ఇది క్యాన్సర్ నివారణకు ఒక మార్గంగా మారుతుందా అనే ప్రశ్న మొదలయింది. ఇది చాలా మంది ప్రాణాలను కాపాడుతుందా? ఇది జబ్బు సోకక ముందే తీసుకోవాలా? క్యాన్సర్ అని తేలిన తర్వాత కూడా పని చేస్తుందా? ఈ వ్యాక్సీన్ ప్రయోజనాలేంటి? గతంలో అందుబాటులో ఉన్న వ్యాక్సీన్‌కు, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే వ్యాక్సీన్‌కు మధ్య తేడా ఏంటి? ఇలాంటి చాలా సందేహాలు తలెత్తాయి. వీటికి సమాధానాలు తెలుసుకునేందుకు బీబీసీ కొంత మంది వైద్య నిపుణులను సంప్రదించింది.

 
సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి?
సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ క్యాన్సర్ ) లైంగికంగా సంక్రమిస్తుంది. కొన్ని రకాల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దారి తీస్తాయి. గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా హెచ్‌పీవీ-16, 18 వల్ల వస్తుంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడేందుకు భారతదేశంలో తొలిసారిగా క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సీన్ అందుబాటులోకి రానుందని గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ చందు చెప్పారు.

 
భారత మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గర్భకోశ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భకోశ క్యాన్సర్‌ది నాలుగో స్థానం. క్యాన్సర్ బారిన పడి 15- 44 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల మరణాలకు కూడా సర్వైకల్ క్యాన్సర్ రెండవ ప్రధాన కారణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో ఐదువంతుల కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ఇండియాలో ప్రతి ఏటా1.23 లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండగా 67,000 మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ తెలిపింది.

 
ఎందుకు సోకుతుంది?
చిన్న వయసులోనే లైంగిక సంబంధాలు ఉండడం, చిన్న వయసులో గర్భం దాల్చడం, ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి వుండడం, పేదరికం, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పోషకాహార లోపం లాంటివి దీనికి కారణాలుగా చెప్పవచ్చని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యుగంధర్ శర్మ చెప్పారు.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ధూమపానం, HIV/AIDs, క్లమిడియా లాంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు లాంటి ఇతర అంశాల కూడా దీనికి కారణం కావచ్చు. అధిక సంఖ్యలో ప్రసవాలు, అనేక మంది భాగస్వాములు ఉండటం వల్ల కూడా హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందని డాక్టర్ శైలజ చందు అన్నారు.

 
లక్షణాలెలా ఉంటాయి?
సెక్స్ తర్వాత రక్తస్రావం జరగడం, సెక్స్ సమయంలో నొప్పి, కటి భాగంలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యుగంధర్ శర్మ చెప్పారు. వైట్ డిశ్చార్జ్, అధిక రక్త స్రావం, సమయానికి ముందుగానే పీరియడ్స్ రావడం, నడుం నొప్పి, కిడ్నీలు వైఫల్యం చెందడం కూడా జరగొచ్చు. బరువు తగ్గడం, రక్తహీనత కూడా కనిపించొచ్చు.

 
దీని బారిన పడకుండా రక్షించుకోవడం ఎలా?
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవడానికి స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ రెండు శక్తివంతమైన మార్గాలు. "ఈ క్యాన్సర్ నివారణ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. 10% కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే స్క్రీనింగ్ చేయించుకుంటారు. క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం" అని డాక్టర్ శైలజ చందు వివరించారు. "సర్వైకల్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ స్థాయిలోనే గుర్తించగలిగితే చిన్న చికిత్సతోనే నిర్మూలించవచ్చు, పాప్ స్మియర్ పరీక్ష ప్రీ క్యాన్సర్ దశను గుర్తిస్తుంది. ఇది గనక గుర్తించగలిగితే చాలా ప్రయోజనం ఉంటుంది". "29-45 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ప్రతీ 3 సంవత్సరాలకొకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. 50 - 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు 5 ఏళ్ల కొకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి" అని డాక్టర్ శైలజ చందు చెప్పారు. "స్వలింగ సంపర్కులు, వ్యాక్సీన్‌కు అర్హులైన ట్రాన్స్ జెండర్లకు మూడు టీకాల మోతాదు అవసరం" అన్నారామె. సెక్స్‌లో పాల్గొన్న ప్రతీ సారి కండోమ్ వాడాలని, పొగ తాగకూడదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.

 
దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు ఏంటి?
భారతదేశంలో ప్రస్తుతం అంతర్జాతీయ లైసెన్సులు ఉన్న గర్దాసిల్, సెర్వారిక్స్ అనే రెండు రకాల వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఖరీదు ఎక్కువ. దీంతో, ఇవి అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండవని మ్యాక్స్ హాస్పిటల్‌లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రష్మీ శుక్ల చెప్పారు. 2008లోనే హెచ్‌పీవీ వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీనిని జాతీయ టీకా కార్యక్రమాల్లో భాగంగా చేర్చలేదు.

 
కొత్త వ్యాక్సీన్ ఏంటి?
హెపటైటిస్-బి వ్యాక్సీన్ తరహాలో వైరస్‌ను పోలిన పదార్ధాలతో ఈ వ్యాక్సీన్ తయారు చేశారు. హెచ్‌పీ‌వీ వ్యాక్సీన్ ఎల్-1 ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేసి గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని డాక్టర్ శైలజ చందు వివరించారు. "క్యూహెచ్‌పీవీ వ్యాక్సీన్ క్వాడ్రివాలేంట్ వ్యాక్సీన్. 90 శాతం సర్వికల్ క్యాన్సర్ కేసులకు హెచ్‌పీవీ 16, 18 స్ట్రెయిన్‌లు కారణమవుతాయి. హెచ్‌పీవీ 16, 18, 31, 33 స్ట్రెయిన్‌లు క్యాన్సర్ కారకం కాగా, 6, 11 స్ట్రెయిన్‌ల వల్ల యోని భాగంలో ఉలిపిర్లు, పొక్కులు లాంటివి ఏర్పడతాయి" అని డాక్టర్ శైలజ చెప్పారు. క్యూహెచ్‌పీవీ వ్యాక్సీన్ 6, 11, 16, 18 స్ట్రెయిన్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు.

 
మహిళల్లో ఏర్పడే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు మొదటి సారి భారతదేశంలో హెచ్‌పీవీ వ్యాక్సీన్ లభిస్తుందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ట్వీట్ చేశారు. ఇది అందరికీ అందుబాటయ్యే ధరలో ఉంటుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఈ వ్యాక్సీన్ భారతదేశంలో అందుబాటులోకి రావడంతో అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి కూడా అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వ జాతీయ టీకా కార్యక్రమాల్లో చేర్చడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని డాక్టర్ రష్మీ శుక్ల అన్నారు.

 
ఎవరికి ఇవ్వాలి? ఇవ్వకూడదు?
11- 12 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలకు ఈ వ్యాక్సీన్ ఇవ్వాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.  హెచ్‌పీవీ వ్యాక్సీన్‌ను 9 - 12 సంవత్సరాల లోపు ఇవ్వడం వల్ల ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా ఇస్తే మంచిది. ఒక వేళ ఆ వయసులో ఇవ్వకపోతే, కనీసం 26 ఏళ్ల లోపు ఇస్తే ప్రయోజనం ఉంటుందని డాక్టర్ శైలజ చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో 11- 12 ఏళ్ల పిల్లలకు రెండు డోసులు వ్యాక్సీన్ ఇవ్వాలి. 15 ఏళ్ల లోపు పిల్లలకు రెండు డోసులు ఇవ్వడం వల్ల ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాక్సీన్ ఇవ్వరు. వ్యాక్సీన్ లో ఉన్న పదార్ధాల వల్ల అలర్జీ ఉన్న వారు కూడా ఈ వ్యాక్సీన్ తీసుకోకూడదు.

 
లైంగికంగా చురుకుగా ఉండేవారికి కూడా పనిచేస్తుందా?
"ఈ వ్యాక్సీన్ ఇవ్వడానికి అమ్మాయిలను అవమానపరిచినట్లుగా , మా అమ్మాయి చిన్న పిల్ల అని అంటూ వ్యాక్సీన్ ఇప్పించేందుకు సంశయిస్తారు. అమ్మాయిలకు పట్టు పరికిణీలు కొనడం, వజ్రాల నగలు కొనడం కంటే వ్యాక్సీన్ ఇవ్వడం ముఖ్యం" అని డాక్టర్ శైలజ అన్నారు. 27-45 సంవత్సరాల వరకు వ్యాక్సీన్ ఇవ్వవచ్చని సీడీసీ సూచించింది. 45 సంవత్సరాల వరకు వ్యాక్సీన్ తీసుకోవచ్చు. కానీ దాని ప్రభావం 40 - 45% వరకు తగ్గిపోతుంది. కానీ, లైంగిక జీవితం మొదలవ్వక ముందే ఇవ్వడం వల్ల దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ శైలజ అన్నారు.



"టీకాలు వేయించుకున్న అమ్మాయిల నుంచి హెచ్‌పీవీ వైరస్ సోకదు. తద్వారా 'హెర్డ్ ఇమ్యూనిటీ' పెరుగుతుంది. బాలికలకు టీకాలు వేయడం వల్ల పరోక్షంగా ఈ రకమైన క్యాన్సర్ నుంచి అబ్బాయిలను కాపాడ్డానికి సహాయపడుతుంది" అని డాక్టర్ శైలజ చెప్పారు.  "హెచ్‌పీవీ వ్యాక్సీన్ క్యాన్సర్ సోకిన తర్వాత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఈ వ్యాక్సీన్ కాపాడలేదు. వ్యాక్సీన్ తీసుకోక మునుపు సోకని స్ట్రెయిన్‌ల నుంచి మాత్రమే వ్యాక్సీన్ కాపాడగలదు" అని డాక్టర్ యుగంధర్ శర్మ చెప్పారు. పురుషుల మధ్య లైంగిక సంబంధాల వల్ల అనోజెనిటల్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. ఇలాంటి వారు కూడా వ్యాక్సీన్ తీసుకుంటే మంచిదని డాక్టర్ యుగంధర్ శర్మ సూచించారు.
 
వ్యాక్సీన్ ప్రతికూల ప్రభావాలేంటి?
దీని వల్ల చాలా తేలికపాటి ప్రతికూల ప్రభావాలుంటాయి. ఈ వ్యాక్సీన్ చేసిన ప్రాంతంలో చర్మం కమలడం, వాపు లాంటివి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి తల తిరిగి పడటం, వికారంగా ఉండటం లాంటివి జరుగుతాయి. ఇంజక్షన్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల తల తిరగడం తగ్గుతుంది. తలనొప్పి, వికారం, అలసట, నీరసం లాంటివి రావచ్చు. కీళ్ల నొప్పులు రావచ్చు.
 
వ్యాక్సీన్ తీసుకున్న వారు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలా?
వ్యాక్సీన్‌కి స్క్రీనింగ్‌కి సంబంధం లేదు. వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా 21 ఏళ్ల తర్వాత నుంచి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. "వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ స్క్రీనింగ్, పాప్ స్మియరింగ్ పరీక్షలు చేయించుకోవడం మాత్రం మానేందుకు లేదు" అని డాక్టర్ రష్మీ శుక్ల చెప్పారు. "సర్వైకల్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ స్థాయిలోనే గుర్తించగలిగితే చిన్న చికిత్సతోనే నిర్మూలించవచ్చు, పాప్ స్మియర్ పరీక్ష ప్రీ క్యాన్సర్ దశను గుర్తిస్తుంది. ఇది గనక గుర్తించగలిగితే చాలా ప్రయోజనం ఉంటుంది. 29 - 45 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ప్రతీ 3 సంవత్సరాలకొకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. 50 - 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు 5 ఏళ్ల కొకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి" డాక్టర్ శైలజ చెప్పారు.
 
"సర్వైకల్ క్యాన్సర్ ను చాలా ఆఖరు దశల్లో గుర్తిస్తారు. మొదటి దశలో గుర్తిస్తే శస్త్ర చికిత్స చేసి చికిత్స చేయవచ్చు. కానీ, తొలి దశ దాటితే మాత్రం కీమో థెరపీ, రేడియేషన్ చేయాల్సి వస్తుంది. నాలుగవ దశలో గుర్తిస్తే ఇది చాలా ప్రమాదకరం. స్క్రీనింగ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల దురదృష్టవశాత్తు భారతదేశంలో వీటిని ఆలస్యంగా గుర్తిస్తున్నాం" అని డాక్టర్ యుగంధర్ శర్మ చెప్పారు.
 
వ్యాక్సీన్ వివాదం ఏంటి?
వ్యాక్సీన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు 2009లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో పాథ్ అనే స్వచ్చంద సంస్థ వ్యాక్సీన్ డెలివరీ, డిమాన్‌స్ట్రేషన్ ప్రాజెక్టును నిర్వహించింది. కానీ, ఈ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఏడుగురు అమ్మాయిలు మరణించారంటూ ఆందోళన తలెత్తడంతో ఈ ప్రాజెక్టును 2010లో సస్పెండ్ చేసినట్లు డిసెంబర్ 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ గైనకాలజిక్ ఆంకాలజీ లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. అయితే, 2011లో ప్రభుత్వం నిర్వహించిన విచారణలో ఈ మరణాలకు వ్యాక్సీన్‌కు సంబంధం లేదని తేలింది. నైతిక నిబంధనలను ఉల్లంఘించలేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సీన్ వల్ల ప్రయోజనాలు, ప్రతికూల ప్రభావాలు, ధర గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీ‌ఎమ్‌ఆర్) నిపుణులు 2016లో సమీక్ష చేసి యుక్త వయసు వచ్చిన అమ్మాయిలందరూ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.
 
 
ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?
9-26 సంవత్సరాల వయసులో ఉన్న బాల బాలికలపై ఈ వ్యాక్సీన్ ప్రభావాన్ని విశ్లేషించేందుకు భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ నిపుణులు, యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో పాటు ఐఏఆర్‌సీ శాస్త్రవేత్తలు కలిసి పని చేస్తున్నారు. ఈ విధమైన పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం వల్ల రెండు, మూడవ దశ ట్రయల్స్ ముగిసినట్లు ఐఏఆర్‌సీ - డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దేశంలో 12 కేంద్రాల నుంచి కొన్ని వేల మందితో 2019లో క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఫలితాలు సమర్ధవంతంగా కనిపించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ అధికారులు తెలిపినట్లు డాక్టర్ రష్మీ శుక్ల వివరించారు.
 
ఈ వ్యాక్సీన్ ఉత్పత్తి చేసేందుకు పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుంది. ఇది భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు ఆమోదం లభించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనలో ఒక గేమ్ చేంజర్ అవుతుందని డాక్టర్ రష్మీ శుక్ల అన్నారు. వ్యాక్సీన్ తీసుకోవడం, స్క్రీనింగ్, పాప్ స్మియర్ పరీక్షల గురించి అవగాహన సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, దీని ప్రభావం చూడటానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుందని డాక్టర్ యుగంధర్ శర్మ అన్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళ్లకురిచిలో ఘటన.. హాస్టల్‌ ప్రాంగణంలో బాలిక శవం.. ఏం జరిగింది?