Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2020

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2020
, సోమవారం, 18 జనవరి 2021 (17:49 IST)
ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ది ఇయర్ 2019' విజయవంతం కావడంతో మరోసారి BBC ISWOTY పురస్కారంతో బీబీసీ న్యూస్ మీ ముందుకు వస్తోంది. ఈ ఏడాది విజేతను ఎన్నుకోవడం కోసం ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ ఎంపిక చేసిన ఐదుగురు క్రీడాకారిణుల్లో తమకు నచ్చిన వారికి ఓటువేయడం ద్వారా అభిమానులు ఒకరిని విజేతగా ఎన్నుకుంటారు. జ్యూరీ ఎంపిక చేసిన ఐదుగురు నామినీల పేర్లను 2021 ఫిబ్రవరి 8న వెల్లడిస్తారు.

 
అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్లకు వెళ్లి తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్‌ ది ఇయర్ 2020’ విజేతను మార్చి 8న ప్రకటిస్తారు.

 
ఈసారి BBC ISWOTYతో పాటు ‘స్పోర్ట్స్ హ్యాకథాన్’ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిజం విద్యార్థులు భారతీయ మహిళా క్రీడాకారిణుల వివరాలను వికీపీడియాలో చేరుస్తారు. వికీపీడియాలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో ఇప్పటికే ఉన్న సమాచారానికి మెరుగులు దిద్దుతారు. డేటా ఎంట్రీ పరంగా వికీపీడియాకు ఇది ప్రముఖంగా నిలుస్తుంది, దీంతోపాటు ఆన్‌లైన్‌లో భారతీయ మహిళా క్రీడాకారిణుల ఉనికిని, ప్రాతినిధ్యాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది. దీనిపై మరిన్ని వివరాలను ఫిబ్రవరి 8న వెల్లడిస్తారు.

 
బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ మాట్లాడుతూ, "బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డ్‌తో రెండోసారి ముందుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా మహిళా క్రీడాకారిణుల విజయాలను వేడుకగా జరుపుకునేందుకు ఇదో మంచి అవకాశం. వారి విజయాలను గుర్తించడంలో బీబీసీ ముందుండడం సంతోషదాయకం" అని అన్నారు.

 
బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా మాట్లాడుతూ, "కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అకుంఠిత దీక్షతో, తమదైన ముద్రతో క్రీడల దిశ, దిశను మార్చేందుకు తోడ్పడుతున్న అత్యుత్తమ మహిళా క్రీడాకారిణులను గౌరవించే ఉద్దేశంతోనే ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాం. మా పాఠకులు, అభిమానులు ఈ ఏడాది కూడా ఉత్సాహంగా ఈ ఓటింగ్‌లో పాల్గొని తమ అభిమాన క్రీడాకారిణిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

 
బీబీసీ ISWOTY జ్యూరీ ఎంపిక చేసిన ఐదుగురు నామినీల పేర్లను ఫిబ్రవరి 8న వెల్లడించిన తర్వాత, ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. క్రీడారంగంలో ఆ ఐదుగురు క్రీడాకారిణుల ప్రయాణంతో పాటు స్పోర్ట్స్ చేంజ్‌మేకర్స్ పేరుతో క్రీడల్లో మహిళలు ఎదుర్కొన్న అడ్డంకులు, వారి విజయాలపై బీబీసీ కొన్ని వీడియోలు, కథనాలను రూపొందిస్తుంది.

 
భారత క్రీడా రంగానికి విశేష సేవలు అందించిన ఓ ప్రముఖ క్రీడాకారిణికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా బీబీసీ అందిస్తుంది. దాంతోపాటు, వర్థమాన మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు "ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్"ను కూడా బీబీసీ అందిస్తుంది.

 
గత ఏడాది, BBC ISWOTY మొదటి అవార్డును భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందుకున్నారు. భారతీయ క్రీడలకు అందించిన సేవలతో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచన మాజీ అథ్లెట్ పీటీ ఉషకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో కాషాయం జెండా ఎగురవేయాల్సిందే : బీజేపీ హైకమాండ్