Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను

బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
, మంగళవారం, 29 మార్చి 2022 (15:37 IST)
భారత వెయిట్ లిఫ్టర్ సాయిఖోమ్ మీరాబాయి చాను 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021' విజేతగా నిలిచారు. అవార్డు గెలుచుకున్న తర్వాత మీరాబాయి చాను బీబీసీకి కృతజ్ఞతలు తెలిపారు. "నేను ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్నాను. ఈ ఏడాది ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు ఇచ్చినందుకు మరోసారి బీబీసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ఆమె అన్నారు.

 
దిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బీబీసీ న్యూస్ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ మాట్లాడుతూ, "మీరాబాయి చానుకు అభినందనలు. ఆమె ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. ఈ అవార్డుకు సరైన విజేత. బీబీసీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరంలో ఇక్కడ దిల్లీలో ప్రతిభావంతురాలైన భారత క్రీడాకారిణిని సత్కరించడం అద్భుతంగా ఉంది" అని అన్నారు.

 
ఇదే కార్యక్రమంలో, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్, వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరిని 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డు పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మల్లీశ్వరి బీబీసీకి ధన్యవాదాలు తెలియజేశారు. "ఎన్నో పతకాలు సాధించిన తరువాత, ఈ అవార్డు గెలుచుకోవడం నాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. మరింత కష్టపడి పనిచేసేందుకు స్ఫూర్తినిస్తోంది. ప్రస్తుతం బరిలో ఉన్న మహిళా క్రీడాకారులనే కాకుండా, మాలాంటి వారిని కూడా సత్కరిస్తున్నందుకు బీబీసీకి ధన్యవాదాలు" అని ఆమె అన్నారు.

 
అలాగే, యువ క్రికెటర్ షెఫాలీ వర్మకు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కింది. ఈ అవార్డుకు బీబీసీకి కృతజ్ఞతలు తెలుపుతూ, "మరో 20 లేదా 25 ఏళ్ల పాటు భారత జట్టు తరఫున క్రికెట్ ఆడాలన్నదే నా కోరిక. భారత జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు అందించడమే నా లక్ష్యం" అని షెఫాలీ వర్మ చెప్పారు. 2021 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన పారాలింపిక్ మహిళా క్రీడాకారులను, పురుషుల, మహిళల హాకీ జట్లను కూడా బీబీసీ సత్కరిస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నిఖిల్ చోప్రా, ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

webdunia
భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు స్పాన్సర్ చేస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా విచ్చేసి క్రీడాకారులను అభినందించారు. క్రీడా, మీడియా, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

 
BBC ISWOTY విజేతను ఎలా ఎంపిక చేస్తారు?
బీబీసీ ఎంపిక చేసిన ఒక జ్యూరీ (న్యాయనిర్ణేతల బృందం).. భారత క్రీడాకారిణిల పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఆ జ్యూరీలో భారతదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు. ఆ జాబితాలో.. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొంది అగ్రస్థాయిలో నిలిచిన ఐదుగురు క్రీడాకారిణిల పేర్లను.. ఆన్‌లైన్‌లో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ చేశారు. ఈ ఆన్‌లైన్ పబ్లిక్ ఓటింగ్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కొనసాగింది.

 
గత సంవత్సరం.. బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డును చెస్ ప్లేయర్ కోనేరు హంపి గెలుచుకున్నారు. ఆ ఏడాదికి ఇండియన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మను భాకర్‌కు ప్రకటించారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును.. క్రీడా రంగానికి చేసిన అద్భుత కృషికి గాను అన్జు బాబీ జార్జ్‌కు అందించారు. ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే.

webdunia
ఆదితి అశోక్ (గోల్ఫర్)
ఆదితి అశోక్ 2016లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారినప్పటి నుంచీ.. భారత మహిళల గోల్ఫ్‌కు చిరునామా అయ్యారు. ఆదితి 18 ఏళ్ల వయసులో 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడారు. ఒలింపిక్స్‌లో ఆడిన తొలి భారత మహిళా గోల్ఫర్‌గా, రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంలో అతి పిన్నవయసు సభ్యురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఇటీవల 23 ఏళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన ఆదితి.. పోడియం ఎక్కే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. అంతర్జాతీయ స్థాయిలో భారత సక్సెస్ పరిమితంగా ఉన్న గోల్ఫ్ క్రీడలో ఆదితి విజయం.. ఈ ఆట మీద భారతదేశంలో ఆసక్తిని పెంచింది. 2016లో లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్‌లో గెలిచిన తొలి భారత ప్లేయర్ ఆదితి. 2021 డిసెంబర్ 20వ తేదీ నాటికి ఆదితి ప్రపంచంలో 125వ ర్యాంకులో ఉన్నారు.

webdunia
అవని లేఖర (పారాషూటర్)
పారాలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా 20 ఏళ్ల అవని లేఖర చరిత్ర సృష్టించారు. టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు. అదే ఒలింపిక్స్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్స్ SH1లో కూడా అవని కాంస్యం గెలుచుకున్నారు. చిన్నతనంలో జరిగిన ఒక పెద్ద కారు ప్రమాదంలో ఆమె నడుము నుంచి కింది భాగానికి పక్షవాతం వచ్చింది. ఆ ప్రమాదం తరువాత, అవని తండ్రి ఆమెకు షూటింగ్ క్రీడను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. క్రీడలపై ఉన్న మక్కువను కొనసాగిస్తూనే ఆమె లా చదువుతున్నారు.
 
 
లవ్లీనా బోర్గోహైన్ (బాక్సర్)
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించారు లవ్లీనా బోర్గోహైన్. దాంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్‌గా రికార్డు నెలకొల్పారు. వివిధ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలను గెలుచుకున్నారామె. 2018లో ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకుని తొలిసారిగా ఆమె వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో జన్మించిన 24 ఏళ్ల లవ్లీనా తన ఇద్దరు అక్కలను స్ఫూర్తిగా తీసుకుని కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. భారత మహిళల బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేశారు.
 
 
మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టర్)
వెయిట్‌ లిఫ్టింగ్ ఛాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చాను 2021 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన ఘనత ఆమెదే. 2016 రియో ఒలింపిక్స్‌లో ఓటమి నుంచి టోక్యోలో గెలుపు వరకు మీరాబాయి ప్రయాణం మరచిపోలేనిది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2017లో ఆమె బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జన్మించారు మీరాబాయి చాను. ఆమె తండ్రి ఒక టీ స్టాల్ నడిపేవారు. కెరీర్ తొలి దశలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఒలింపిక్ ఛాంపియన్‌గా ఎదిగారు.

webdunia
పీవీ సింధు (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజతం సాధించి 2021 సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించారు సింధు.

 
2022 జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారామె. సింధు 17 సంవత్సరాల వయస్సులోనే 2012 సెప్టెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లోకి అడుగుపెట్టారు. 2019 సంవత్సరానికి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు.. గడిచిన 8 రోజుల్లో..?