Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖగోళ రహస్యం: ఓ రాకాసి నక్షత్రం చూస్తుండగానే మాయమైపోయింది, నిశ్చేష్టులైన శాస్త్రవేత్తలు

Advertiesment
ఖగోళ రహస్యం: ఓ రాకాసి నక్షత్రం చూస్తుండగానే మాయమైపోయింది, నిశ్చేష్టులైన శాస్త్రవేత్తలు
, శనివారం, 4 జులై 2020 (22:08 IST)
హ‌బుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన కిన్మన్ డ్వార్ఫ్ గెలాక్సీ చిత్రం
విశ్వంలో ఒక భారీ నక్షత్రం అదృశ్యమైపోయింది. అది ఎలా మాయమైపోయిందో అంతుచిక్కక ఖగోళవేత్తలు కంగారుపడుతున్నారు. సుదూరంలో ఉన్న ఈ రాకాసి నక్షత్రం విస్ఫోటనం చెందకుండా.. కృష్ణ బిలం (బ్లాక్ హోల్) గా ఏర్పడి ఉంటుందా అని అనుమానిస్తున్నారు. అదే గనక నిజమైతే ఈవిధంగా అంతమైపోయిన తొలి నక్షత్రం ఇదే అవుతుంది.

 
కానీ మరోవిధంగా జరిగే అవకాశం కూడా ఉంది.. మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ రిపోర్ట్స్ అధ్యయనం ప్రకారం పాక్షికంగా ధూళితో నిండి ఉండడం వలన అది అడ్డుపడి ఆ నక్షత్ర కాంతి బాగా తగ్గి అస్పష్టంగా మారి ఉండవచ్చు. ఈ నక్షత్రం భూమికి 7.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కిన్మాన్ డ్వార్ఫ్ గెలాక్సీలో, కుంభ రాశిలో ఉంది.

 
ఇది లుమినస్ బ్లూ వేరియబుల్ రకానికి చెందిన భారీ నక్షత్రం. సూర్యుడికన్నా సుమారు 25 లక్షల రెట్లు కాంతివంతమైనది. ఈ రకమైన నక్షత్రాలు స్థిరంగా ఉండవు. అప్పుడప్పుడు వీటి కాంతి, తరంగధైర్ఘ్యాలలో ఊహించని మార్పులు కనిపిస్తుంటాయి.

 
2001-2011 మధ్య వివిధ బృందాల ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని అధ్యయనం చేసారు. ఇది జీవితం చివరి దశలో ఉందని కనుగొన్నారు. కిన్మన్ డ్వార్ఫ్ గెలాక్సీ చాలా దూరంలో ఉన్నందున ఒక్కో నక్షత్రాన్ని విడిగా పరిశీలించే అవకాశం లేదు. కానీ కొన్ని భారీ నక్షత్రాల స్థితిగతులను గమనించగలరు.

 
2019 లో ట్రినిటీ కాలేజ్ డబ్లిన్‌లో పిహెచ్‌డి చేస్తున్న ఆలెన్ తన బృందంతో కలిసి ఈ గెలాక్సీలోని పెద్ద పెద్ద నక్షత్రాలు ఎలా అంతమవుతాయనే అంశంపై పరిశోధన చేసారు. ఈ పరిశోధనలో భాగంగా యూరోపియన్ సదరన్ అబ్సర్వేటరీ (ఈయెస్ఓ)కి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ (వీఎల్‌టీ)తో పరిశీలించినప్పుడు ఈ భారీ నక్షత్రం జాడ కనిపించలేదు.

 
"ఆ నక్షత్రం అదృశ్యమైపోయిందని గ్రహించి ఆశ్చర్యపోయాం. అంత పెద్ద నక్షత్రం విస్ఫోటనం చెందకుండా, సూపర్నోవాగా మారకుండా అదృశ్యమైపోవడమనేది అసాధారణమైన విషయం" అని ఆలెన్ అన్నారు. గత అధ్యయనాలను పరిశీలిస్తే ఈ నక్షత్రంపై పెద్ద పెద్ద ప్రేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. అయితే అవి 2011 తరువాత ఆగిపోయాయి. లుమినస్ బ్లూ వేరియేషన్‌కు చెందిన నక్షత్రాలలో ఇలాంటి ప్రేలుళ్లు సాధారణమే. వీటివలన అవి కొంత ద్రవ్యరాశి కోల్పోతాయి.

 
ఈ నక్షత్రం అదృశ్యమైపోవడానికి శాస్త్రవేత్తలు రెండు కారణాలు చూపిస్తున్నారు. ఒకటి, ప్రేలుళ్ల వలన లుమినస్ బ్లూ వేరియబుల్ నక్షత్రం ద్రవ్యరాశి కోల్పోయి క్రమక్రమంగా ప్రకాశాన్ని కోల్పోయి ఉండొచ్చు. ధూళివలన తగ్గిపోయిన కాంతి కూడా అస్పష్టమై ఉండొచ్చు. రెండు, అసలు విస్ఫోటనమే జరగకుండా, రాలిపడి బ్లాక్ హోల్‌గా మారి ఉండొచ్చు.

 
ఇది చాలా అరుదైన విషయం
"కృష్ణ బిలంగా మారిన మాట నిజమైతే, ఒక భారీ నక్షత్రం ఈ విధంగా అంతమవడం ఇదే మొదటిసారి" అని ఆలెన్ అన్నారు. "ఇదే నిజమైతే విశ్వంలోని భారీ నక్షత్రాల్లో ఒకటి మౌనంగా చీకటిలో కలిసిపోయింది" అని ట్రినిటీ కాలేజ్‌లో పనిచేస్తున్న జోస్ గ్రోహ్ పేర్కొన్నారు. ఆ తార ఏమైపోయిందనే విషయం భవిష్యత్తు పరిశోధనల్లో తెలిసే అవకాశం ఉంది.

 
ఈయెస్ఓకు చెందిన ఎక్స్ట్రీంలీ లార్జ్ టెలిస్కోప్ (ఈఎల్‌టీ) 2025 నాటికి వాడుకలోకి వస్తుంది. విశ్వంలోని ఇలాంటి రహస్యాలను ఛేదించడానికి ఇది ఉపయోగపడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రాజధానిని నాశనం చేస్తున్నారు: ఎమ్మెల్యే గద్దె రామమోహ‌న్‌