Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా ? అయితే ఈ విషయాలు మీరు గమనించాల్సిందే...

Advertiesment
google map

బిబిసి

, శనివారం, 14 డిశెంబరు 2024 (18:03 IST)
గమ్యస్థానం ఏదైనా సరే, రాజ్‌దాస్ ఎక్కువగా కారులోనే వెళుతుంటారు. వెళ్లే ప్రాంతానికి దారి కనుక్కోవడానికి చాలామందిలాగే శాటిలైట్ నేవిగేషన్ టూల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే గతవారం రాజ్‌దాస్‌కు ఒక వింత అనుభవం ఎదురైంది. దిల్లీ నుంచి గోవా వెళ్లేందుకు ఆయన గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించారు. తన స్నేహితుడు, ఇద్దరు బంధువులతో కలిసి సెడాన్ కారులో బయల్దేరారు. పనాజీ వెళ్లేందుకు కర్ణాటకలోని బెళగావి (బెల్గాం) నుంచి ఒక షార్ట్‌కట్ రూట్‌ను ఎంచుకున్నారు. కానీ, అలా వెళ్తూ వెళ్తూ చివరకు పశ్చిమ కనుమల్లోని ఖానాపూర్ అడవుల్లో చిక్కుకుపోయారు.
 
"అది మేము తిరిగి వెనక్కి రావడానికి కూడా వీలులేని దారి. మేం ఆగిపోయిన ప్రాంతం నుంచి ఇక ముందు రోడ్డు కూడా లేదని, మేమంతా అడవిలో ఉన్నామని కాసేపటి తర్వాత అర్ధమైంది" అని రాజ్‌దాస్ బీబీసీతో అన్నారు. అదృష్టవశాత్తూ, ఈ రోడ్డు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ తరహాలో సగం వరకే ఉన్న బ్రిడ్జ్ కాదు. బరేలీలో ఇలా అసంపూర్ణంగా ఉన్న వంతెన మీదుగా ప్రయాణించిన కారు నదిలో పడటంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు మరణించిన ఘటన ఇటీవలే జరిగింది. దాస్, ఆయన స్నేహితుడు, బంధువులకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. వారి కారు అడవిలో ఆగిన తర్వాత మొబైల్స్ చూసుకుంటే సిగ్నల్ కూడా లేదు. పైగా ఆ అడవి ప్రమాదకరమైందని వాళ్లు ఇంతకు ముందే విని ఉన్నారు.
 
అడవిలోకి ఎలా వెళ్లారు?
దాస్, ఆయన ఫ్రెండ్...ఒక ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే సంస్థలో పని చేస్తున్నారు. వాళ్లు పనాజీలో ఒక మీటింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. మీటింగ్‌తోపాటు గోవాలో కాస్త రిలాక్స్ అవుదామనుకున్నారు. అందుకే తమతో పాటు బంధువులను కూడా తీసుకెళ్లారు. "మా ప్రయాణంలో దారి పొడవునా గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తూ వచ్చాం. కానీ, ఎక్కడా సమస్యలు ఎదురు కాలేదు" అని దాస్ మేనల్లుడు ఆకాశ్ బీబీసీకి చెప్పారు. కారులో దిల్లీ నుంచి బెళగావికి ప్రయాణించినప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో తాము ప్రయాణిస్తున్న జాతీయ రహదారి ముగిసిపోయి, గోవా వెళుతున్న మరొక రోడ్డును చూపించిందని దాస్ చెప్పారు. దీంతో తాము గోవా వైపు వెళుతున్న మార్గంలోకి, పక్కనే ఉన్న ఇంకొక రోడ్డులోకి మారినట్లు దాస్ చెప్పారు.
 
"ఉదయం ఆరు గంటలకు రోడ్ గేట్లు తెరుస్తామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. మేము రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అక్కడే ఉన్నాం. అక్కడ నుంచి బయల్దేరేటప్పుడు జాతీయ రహదారి చివరకు వెళ్లిన తర్వాత కుడివైపుకు వెళ్లమని అధికారులు సూచించారు" అని దాస్ చెప్పారు. అధికారులు చెప్పినట్లు ప్రయాణించిన దాస్ బృందం, అక్కడ ఒక మట్టి రోడ్డుపై ఇంకా కొన్ని వాహనాలు వెళ్లడాన్ని గమనించింది. ఆ మట్టి రోడ్డులో నాలుగున్నర కిలోమీటర్లు ప్రయాణిస్తే జాతీయ రహదారి చేరుకోవచ్చని అటవీశాఖ అధికారులు దాస్‌కు చెప్పారు. తాము కూడా నలుగురం ఉండటంతో ఆ రోడ్డులోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు దాస్ చెప్పారు.
 
"ఇంతకుముందెప్పుడూ ఇలాంటి రోడ్డు చూడలేదు. చాలా అధ్వాన్నంగా ఉంది. రెండు మూడు కిలోమీటర్లు వెళ్లాక అక్కడ అసలు రోడ్డేలేదని అర్థమైంది" అని దాస్ చెప్పారు. దారుణమైన విషయం ఏంటంటే అక్కడి నుంచి వెనక్కి రావడం కూడా కుదరదు. అంటే ఈ రోడ్డు ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు. పైగా ఆ అడవి ప్రమాదకరమైనది తెలియడంతో వారు రిస్కు తీసుకోలేకపోయారు. ఆ నిస్సహాయ వాతావరణంలో ఉదయం వరకు కారులోనే కూర్చున్నారు. ఆ ప్రాంతంలో ఫోన్ కనెక్టివిటీ కూడా లేదు. ఫోన్ నెట్‌వర్క్ కోసం కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది. అటవీ శాఖ అధికారులను, ఆ తర్వాత112 నెంబర్‌కు డయల్ చేసి పోలీసులను సంప్రదించేందుకు దాస్ ప్రయత్నించారు. పోలీసుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వారికి సూర్యోదయం చూడగానే కొత్త ఆశ వచ్చింది. అయితే, తాము వచ్చిన దారిలో అలా ముందుకు వెళితే ఒక చిన్న కాలువలోకి వెళతామని దాస్, ఆయన మేనల్లుడు గుర్తించారు. వాళ్లను అడవి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఉదయం 6 గంటలకు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు అక్కడికి వచ్చారు.
 
పరిష్కారం దొరకని ప్రశ్నలు
రోడ్డు లేకపోతే ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఆ దారిలో వెళ్లమని ఎందుకు చెప్పారు? అడవిలో ఉన్న ఆ రోడ్డు మీద 'అటవీ ప్రాంతం' అని బోర్డు ఎందుకు పెట్టలేదు? అని దాస్ ఆశ్చర్యపోయారు. "ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ కూడా చాలా రాంగ్ రూట్లను చూపిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు" అని ఆయన అన్నారు. అయితే, గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం గురించి ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి? "గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించడం పూర్తిగా మానేశానని నేను చెప్పను. ఆ సంఘటన తర్వాత కూడా నేను గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నా. అయితే అది గతంలో నేను ఉపయోగించినట్లుగా కాదు" అని దాస్ అన్నారు.
 
"గతంలో నేను పూర్తిగా గూగుల్ మ్యాప్స్‌ మీద ఆధారపడ్డాను. ఎందుకంటే వందల కిలోమీటర్లు ఒంటరిగా, అది కూడా కొత్త ప్రదేశాల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మనం ఈ యాప్‌ను పూర్తిగా పక్కనబెట్టలేం" అన్నారాయన. ‘‘గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం కొంతవరకు ఫర్వాలేదు, కానీ పూర్తిగా దానిపైనే ఆధారపడటం మంచిది కాదు. మనం దానిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అక్కడక్కడా ఆగి, రోడ్డు ఎటు వెళుతుందో స్థానికులను అడగటం వల్ల నాకు ఎదురైన అనుభవం ఎదురు కాకపోవచ్చు’’ అని దాస్ అంటున్నారు.
 
గూగుల్ టాక్
తమ యాప్ వాడుతున్న యూజర్లకు ఉన్నంతలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని, క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదని, యూజర్ల సేఫ్టీ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నామని గూగుల్ అంటోంది. ‘‘కస్టమర్లకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి, వాళ్లు సేఫ్‌గా ప్రయాణించడంలో సాయపడేందుకు మేం నిత్యం ప్రయత్నిస్తున్నాం’’ అని ఆ సంస్థ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న మార్పులు తమకు అందుబాటులో ఉన్న డేటాకు సవాలుగా మారుతున్నాయని కూడా గూగుల్ చెప్పింది. ఉదాహరణకు "ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బెస్ట్ అండ్ సేఫ్ మార్గం కూడా వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల నాటకీయంగా మారిపోవచ్చు" అని సంస్థ తెలిపింది.
 
మ్యాప్స్‌ను అప్‌డేట్ చెయ్యడానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, డేటా పార్ట్‌నర్‌‌లతో పాటు అనేక ప్రదేశాల నుంచి ప్రతీ రోజూ మిలియన్ల సంఖ్యలో వచ్చే ఇన్‌పుట్స్‌ను ఉపయోగిస్తోంది. దేశంలోని అనేక నగరాల్లో ట్రాఫిక్ పోలీసు విభాగాలు గూగుల్ పార్ట్‌నర్స్‌గా పని చేస్తున్నాయి. ఏదైనా రోడ్డును క్లోజ్‌ చేసినా, ఆ రోడ్డు మీద ప్రయాణం కుదరకపోయినా ఆ సమాచారాన్ని గూగుల్‌కు చేరవేయడం ఈ పార్టనర్‌షిప్ ప్రధాన ఉద్దేశం. 2023లో దిల్లీలో నిర్వహించిన జీ ట్వంటీ సదస్సు, పలు నగరాల్లో నిర్వహించిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఇలాంటి ప్రయత్నాల ఫలితాలు కనిపించాయి. వీటితో పాటు అల్గారిథమ్, ఆపరేషన్ చానల్స్, యూజర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మారుతున్న రోడ్ల స్థితిపై గూగుల్ నిరంతరం అప్‌డేట్స్ ఇస్తోంది.
 
"చెయ్యాల్సింది చాలా ఉంది. ఇంకా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం." అని సంస్థ తెలిపింది. రెండు వారాల కిందట నితిన్, అజిత్, అమిత్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ పెళ్లికి వెళ్లేందుకు ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ నుంచి బరేలీకి బయల్దేరారు. గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకున్న వారు, అది చూపించిన ప్రకారం ఓ బ్రిడ్జి మీదకు వచ్చారు. కానీ, ఆ బ్రిడ్జి వరదల కారణంగా సగం కూలిపోయి ఉంది. గూగుల్ మ్యాప్‌ను నమ్మి వారు దాని మీద ప్రయాణిస్తూ నదిలో పడిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు ఇంజనీర్లు, గూగుల్ మ్యాప్స్‌కు సంబంధించి పేరు వెల్లడించని ఓ అధికారిపై కేసు నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో డిజిటల్, సోషల్ మీడియా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌