Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణంపై బొత్స ఏమన్నారు? శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది?

అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణంపై బొత్స ఏమన్నారు? శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది?
, బుధవారం, 21 ఆగస్టు 2019 (09:43 IST)
రాజధాని అమరావతిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం మరోసారి చర్చనీయమైంది. రాజధాని అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
బొత్స వ్యాఖ్యలను విప‌క్ష టీడీపీ త‌ప్పుబ‌డుతోంది. అమరావతి అభివృద్ధిపై ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదని, రాజ‌ధాని ఎటు తీసుకెళ్తారో స్ప‌ష్ట‌త‌ ఇవ్వాలని పురపాలకశాఖ మాజీ మంత్రి పి.నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ‌పట్నంలో మ‌ంగళవారం మీడియా స‌మావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ- అమరావతి ప్రాంతం రాజధానిగా సురక్షితం కాదని శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిందని, రాజధానిపై మళ్లీ చర్చించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
 
తమ ప్రభుత్వం వచ్చాక అన్ని అంశాలూ పరిశీలించామని, నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతంలో లక్ష రూపాయలుంటే, అమరావతిలో రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందన్నారు. దీంతోపాటు ఇప్పుడు వచ్చినట్లుగా భారీ వ‌ర్షాలు వ‌స్తే ఇక్కడ ముగినిపోయే ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ముంపును నివారించేందుకు కాలువ‌లు, డ్యాములు క‌ట్టి నీటిని పంపింగ్ చేయాల్సి వస్తోందని, వాటిని కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని చర్చిస్తున్నామని, త్వ‌ర‌లో తమ విధానాన్ని ప్ర‌క‌టిస్తామని మంత్రి తెలిపారు.
 
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బీబీసీతో బొత్స
అమ‌రావ‌తి ప్రాంతంలో రాజ‌ధాని నిర్మిస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పిందని, అదే తాను గుర్తుచేశానని బొత్స స‌త్యనారాయ‌ణ బీబీసీతో చెప్పారు. విశాఖలో చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రిని బీబీసీ వివరణ కోరగా- "నేను చెప్పిన అంశాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాను. కానీ కొంద‌రు దానిని ప‌లు ప‌లు విధాలుగా తీసుకుంటే నేనెలా బాధ్యుడిని" అన్నారు.
 
ఓ మీడియా మిత్రుడు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పిన దానిని గుర్తుచేశానని, అమరావతి అనువైన స్థ‌లం కాద‌ని కమిటీ చెప్పిందని ఆయన తెలిపారు. కమిటీ చెప్పిన‌ట్టే చిన్న వ‌ర‌ద రాగానే అమరావతిలో ఏరులై పారుతోందన్నారు. నిర్మాణానికి సాధారణ ప్రాంతాల్లో లక్ష రూపాయలు ఖర్చయితే అమరావతిలో రెండు లక్షలు రూపాయలవుతుందని చెప్పానని, ఉన్న మాటే అన్నానని మంత్రి తెలిపారు. ఈ అంశాలన్నీ ప‌రిశీలిస్తున్నామని అన్నానని చెప్పారు.
webdunia
 
నిలిచిపోయిన పనులు 
భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్‌) కింద 33 వేల ఎక‌రాల భూములను టీడీపీ ప్రభుత్వం సమీకరించింది. సింగ‌పూర్ స‌హాయంతో 'సీడ్ క్యాపిట‌ల్' నిర్మాణం కోసం ప్ర‌య‌త్నించింది. కొన్ని భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు ప్రారంభించింది. రాజధానిలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించిన‌ స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టుల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాలను అద్దె భ‌వ‌నాల్లో నిర్వ‌హిస్తున్నారు.
 
ఎన్నిక‌ల ముందు వరకు రాజ‌ధాని నిర్మాణ ప‌నుల సంద‌డి క‌నిపించింది. ఎమ్మెల్యేలు, అధికారుల గృహాల నిర్మాణం పూర్తి కావొచ్చింది. షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి నాటికే పూర్తికావాల్సిన ఈ నిర్మాణాలు ఆల‌స్యమయ్యాయి. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గత కొన్ని నెల‌లుగా రాజ‌ధాని నిర్మాణ ప‌నులు నిలిపేశారు.
 
ఎందుకు నిలిపేశారు? 
అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అమ‌రావ‌తి నిర్మాణ ప‌రిస్థితిని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల త‌ర్వాత రాజ‌ధాని ప‌నుల‌పై స‌మీక్ష చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ముఖ్యంగా వివిధ సంస్థ‌ల‌కు భూకేటాయింపులు, రాజ‌ధాని భ‌వ‌నాల నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు చేసిన చెల్లింపుల‌పై పూర్తిస్థాయి ప‌రిశీల‌న జరిపాకే ప‌నులు పునఃప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది.
webdunia
 
అసెంబ్లీలో సీఎం జగన్ ఏమన్నారు? 
ఇటీవ‌ల శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి జగన్ మాట్లాడుతూ- రాజధాని అమ‌రావ‌తి నిర్మాణానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో రాజ‌ధానిలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, వాటిపై ద‌ర్యాప్తు జ‌రిపి, వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సి ఉందని చెప్పారు.
 
క‌మిటీ ఏం చెప్పింది? 
ఏపీ రాజ‌ధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. క‌మిటీ వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, అభిప్రాయాల‌ను సేక‌రించింది. త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం ముందుంచింది. డెల్టా ప్రాంతంలో రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం శ్రేయ‌స్క‌రం కాద‌ని తెలిపింది. అయితే టీడీపీ ప్రభుత్వం అమ‌రావ‌తిని రాజధానిగా ఎంపిక చేసి, భూసమీకరణ చేపట్టింది. తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాల పనులను ప్రారంభించింది.
 
ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అనుమానాలు: పి.నారాయణ 
చంద్ర‌బాబు ఎంతో క‌ష్ట‌ప‌డి అమ‌రావ‌తి న‌గ‌రాభివృద్ధికి పునాదులు వేశారని, జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం దీనిని నీరుగార్చేస్తోంద‌ని టీడీపీ సీనియర్ నేత పి.నారాయ‌ణ విమర్శించారు. అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌జ‌ల్లో చాలా అనుమానాలున్నాయని, తాము కూడా వాటిని ప్రస్తావించామని ఆయన బీబీసీతో చెప్పారు.
 
"గ‌త మూడు నెల‌లుగా అమ‌రావ‌తి అభివృద్ధి కుంటుప‌డింది. ఎంతో క‌ష్ట‌ప‌డి రాజ‌ధానిని ఎంపిక చేసి, రైతుల అంగీకారంతో చరిత్రాత్మ‌కంగా భూములు సేక‌రించి, ప‌లు భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభిస్తే అవ‌న్నీ ఇప్పుడు ఏమ‌వుతాయోన‌నే ఆందోళ‌న జ‌నంలో మొద‌లైంది. ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని ఎటు తీసుకెళ్తారో స్ప‌ష్ట‌త‌ ఇవ్వాలి" అని నారాయణ డిమాండ్ చేశారు.
webdunia
 
రుణం నిరాకరించిన ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ 
అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,065 కోట్లు) రుణం ఇచ్చే ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు జులైలో విరమించుకుంది. అమరావతి సుస్థిర మౌలిక, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుగా పిలిచే ప్రాజెక్టు నుంచి వైదొలగింది. తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) కూడా తప్పుకొంది.
 
మొత్తం ప్రాజెక్టు వ్యయం 715 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4,923 కోట్లు). ఇందులో 300 మిలియన్ డాలర్లు రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. మిగతా నిధులు ఏఐఐబీ నుంచి వస్తాయని ఆశించింది. ప్రాజెక్టు నుంచి వైదొలగుతూ ప్రపంచ బ్యాంకు నిర్ణయం తీసుకున్నాక ఏఐఐబీ కూడా అదే బాటలో నడిచింది. 

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓయో టౌన్ విల్లా హోటల్‌లో వ్యభిచారం....