ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అంశాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికులకే పెద్ద పీట వేయాలని చట్టం రూపొందించింది. ఏపీ అసెంబ్లీ బుధవారం ఈ బిల్లును ఆమోదించింది. దీనిపై పారిశ్రామిక, కార్మిక, నిరుద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
బిల్లులో ఏముంది?
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జూలై 22 నాడు ఏపీ ప్రభుత్వం తరుపున 6 బిల్లులు ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్ పారిశ్రామిక రంగంలో ఉపాధికి సంబంధించిన బిల్లుని అసెంబ్లీ ముందుంచారు.
ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ఉమ్మడి సంస్థలలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
ఇక నుంచి రాబోయే అన్ని పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.
ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో రాబోయే మూడేళ్ల కాలంలో స్థానికుల ఉద్యోగాలు 75శాతానికి పెంచాలి.
స్థానికంగా తగిన అర్హత లేని ఉన్న వారు అందుబాటులో లేకపోతే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి.
స్థానికతను నిర్ణయించేందుకు రాష్ట్రం, జిల్లా, జోన్లవారీగా నిర్ణయిస్తారు.
మినహాయింపులు అవసరం అయితే ప్రభుత్వానికి నివేదించాలి.
చట్టం అమలు కోసం నోడల్ ఏజన్సీ ఏర్పాటు చేస్తారు.
‘ఉపాధి అవకాశాలు పెంచడానికే’ - మంత్రి జయరామ్
పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇస్తున్న వారికి తగిన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం రూపొందించామని మంత్రి జయరామ్ బీబీసీకి తెలిపారు. "పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారు తగిన అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులను చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం చేస్తున్న సంస్థల కారణంగా చాలామందిలో అసంతృప్తి ఏర్పడుతోంది. యువత ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా సరళతరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాం" అంటూ మంత్రి వెల్లడించారు.
నిరుద్యోగులకు ఇది వరం అంటున్న సీఎం జగన్
బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలోను, బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా.. పిల్లలు ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితుల్లో.. పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు 75 రిజర్వేషన్ల బిల్లు తీసుకొస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ఈ బిల్లు చాటిచెబుతుందన్నారు. నిరుద్యోగులకు ఇది ఒక వరం అని పేర్కొన్నారు. ఉద్యోగాలకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లేదా దుబాయ్, కువైట్ వెళ్లే పరిస్థితులు పోవాలని చెప్పారు.
నిబంధనలు పటిష్టంగా ఉండాలి - సీఐటీయూ
స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవ సముచితం అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ స్థానికేతరులకు ప్రాధాన్యతనిస్తున్నారు. కార్మిక చట్టాల అమలు గురించి వారు ప్రశ్నించలేరు అనే ఉద్దేశంతో వారిని తీసుకొస్తున్నారు. చివరకు రాజధాని నగర నిర్మాణంలో కూడా 90శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇప్పుడు అన్ని పరిశ్రమల్లోనూ స్థానికులకు ఉపాధి కల్పించే చట్టం పకడ్బందీగా అమలు చేయాలి. ఎన్ని కేటగిరీలలోనూ స్థానికులకు ప్రాధాన్యం అందేలా చూడడం, నిబంధనలు పటిష్టంగా రూపొందించి, అమలు సక్రమంగా సాగించడం అవసరం" అని అభిప్రాయపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో అలా చేస్తే తెలుగువారి పరిస్థితి ఏమిటి? - ఈఏఎస్ శర్మ
ఆంధ్రప్రదేశ్‌లోని పలు పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యత లేకుండా పోయిన కారణంగానే ఇలాంటి చట్టాలు రూపొందించాల్సి వస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.
"ప్రాజెక్టులలో స్థానిక ప్రజలకు ఉపాధి కలిగించకపోవడం వల్లే ప్రభుత్వం రిజర్వేషన్ చేయాల్సి వస్తోంది. అది సబబే. కానీ అన్ని రాష్ట్రాలలో అటువంటి రిజర్వేషన్లు ఉంటే పై రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలకు హాని కలుగవచ్చు. పైగా మనమందరం భారతీయులం అనే ఉద్దేశానికి కొంతవరకు హాని కలుగుతుంది" అంటూ బీబీసీతో తన అభిప్రాయం పంచుకున్నారు.
చట్టం పరిశీలించాలి అంటున్న పారిశ్రామికవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం కారణంగా పారిశ్రామిక వర్గాలపై ఎటువంటి ప్రభావం చూపుతున్న విషయంలో పరిశీలించాల్సి ఉంటుందని సీఐఐ ఆంధ్రప్రదేశ్ సెక్టార్ ప్రతినిధి శ్యామ్ పేర్కొన్నారు. "ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో కూడా అని చెబుతున్నారు. కాబట్టి చట్టంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెడుతుందో చూడాలి. అవి చూసిన తర్వాత అధికారికంగా స్పందిస్తాం" అని ఆయన తెలిపారు.
స్థానికులకు ఉపాధి కల్పించే విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. చట్టం అమలులోకి రాబోతున్న తరుణంలో ఆచరణలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నది చూడాల్సి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్ , ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో గవర్నర్ ఆమోదం తర్వాత చట్టంగా అమలులోకి రాబోతోంది.
ఈ చట్టం వల్ల పరిశ్రమలు రావన్నది పూర్తిగా దుష్ప్రచారమేనని, తనకు కావాల్సిందల్లా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే, అంతకు మించి తాము ఏమీ కోరడంలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.