శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గురువారం బహిష్కరించింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడటానికి అవకాశమివ్వనందుకు నిరససనగానే నేటి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.
అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. రైతు సమస్యలు, పెట్టుబడి సాయంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వాలంటూ సభలో నినాదాలు చేసిన సభ్యులు అనంతరం సభ నుంచి బయటకు వెళ్లారు.
అంతకుముందు గురువారం అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభాహక్కులు కాపాడాలంటూ శాసనసభ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా పార్టీ శాసనసభ్యులందరూ ఆందోళనలో పాల్గొన్నారు. తెదేపా శాసనసభ ఉపనేతలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.