Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..

jagan - vijaysai
, బుధవారం, 18 మే 2022 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్‌లను ఎంపిక చేసినట్లు వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

 
అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకునే వారే రాజ్యసభ సభ్యులు అవుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

 
విజయసాయి రెడ్డి
విజయసాయి రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డి జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్నారు.

 
ఆర్‌ కృష్ణయ్య
తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య చాలా కాలంగా బీసీ సంఘం తరపున ఉద్యమాలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
 
నిరంజన్ రెడ్డి
ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. వైఎస్ జగన్‌ అక్రమ ఆస్తుల కేసుల్లో ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈడీ, సీబీఐ కోర్టుల్లో వాదనలు వినిపించారు. ఆయన వాదనలు వినిపించిన చాలా కేసుల్లో జగన్‌కు ఉపశమనం లభించింది. సినీ నిర్మాత కూడా అయిన నిరంజన్ రెడ్డి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ మధ్యనే చిరంజీవి, రామ్‌చరణ్‌లతో ఆచార్య సినిమా తీశారు. ఈ బ్యానర్‌పై గతంలో ఘాజీ, రాజుగారి గది2, వైల్డ్ డాగ్ వంటి సినిమాలు తీశారు.
 
బీదా మస్తాన్ రావు
ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. టీడీపీ తరపున 2004లో అల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ నుంచి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కూడా అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, 2019లో నెల్లూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. బీదా మస్తాన్ రావు.. బీఎంఆర్ సంస్థ ఆక్వా రంగంలో పేరొందింది... సొయా ఎక్స్‌పోర్ట్స్ జాతీయ అధ్యక్ష్యుడుగా కూడా ఉన్నారు.
 
విజయసాయి రెడ్డి, మాస్తాన్ రావ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ CA చేశారు. మద్రాస్‌లో కొద్దికాలం రూమ్ మేట్స్‌గా కూడా ఉన్నారు. మస్తాన్ రావ్ తమ్ముడు (కజిన్) బీదా రవి టీడీపీ నేత. మాజీ ఎమ్మెల్సీ. ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతున్నారు.
 
తెలంగాణ వారికి ఎందుకు ఇచ్చామంటే..
ఇద్దరు తెలంగాణ వారికి ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నించగా.. ''ఇవి రాజ్యసభ ఎన్నికలు. దేశానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రా అనేది సమస్య కాదు. ఏ వర్గానికి ఏ స్థానం ఇస్తున్నాం. ఏ విధంగా వారి స్ఫూర్తిని ఉపయోగించుకుంటున్నాం. తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. మొత్తం స్థానాల్లో 50 శాతం బీసీలకు ఇచ్చాం'' అని మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. అలాగే, నిరంజన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు న్యాయవాది అని, ఉమ్మడి హైకోర్టులోనూ వాదించారని తెలిపారు.
 
''1970ల నుంచి బీసీ కులాలు అన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు ఆర్ కృష్ణయ్య'' అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ''47 ఏళ్లలో 12 వేలకు పైగా ఉద్యమాలు చేశాను. 2 వేలకు పైగా జీఓలు తెచ్చాను. నేను తెలంగాణలో మాత్రమే ఉద్యమాలు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ ఉద్యమాలు చేశాను. ఆంధ్రాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసం పోరాడుతున్నా. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో సమాన అవకాశాల కోసం పోరాడుతున్నాను. జాతీయ స్థాయిలో పోరాడుతున్నాను'' అని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
 
ప్రతిపక్షం విమర్శలు..
తెలంగాణకు చెందిన ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా అధికార వైసీపీ అవకాశం ఇవ్వటంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ.. ఏపీలోని 140కి పైగా బీసీ కులాల్లో ఏ ఒక్క నాయకుడికీ రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా? అని ప్రశ్నించింది. ఈ మేరకు టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ట్విటర్లో ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరికి రాజ్యసభ పదవులు ఇవ్వడం ఏపీలో వెనుకబడిన తరగతుల నేతలకు వెన్నుపోటు పొడవటమే అని విమర్శించారు.
 
‘టీడీపీకి దెబ్బకొట్టి, బీసీలకు చేరువ అయ్యేందుకే..’
‘‘జగన్ బీసీలకు చేరువ కావడమే రాజకీయ వ్యూహంగా పెట్టుకున్నారు. బీసీల పార్టీగా టీడీపీకి ఉన్న గుర్తింపును చెరిపేసి, బీసీ వర్గాల్లో పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ఆశించినట్లు ఫలితాలున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో, జగన్ పూర్తి లక్ష్యాలు చేరువ కాగలరో లేదో చూడాలి’’ అని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు.. మహానాడు కోసం పక్కా ప్రణాళిక