Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్: ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఆ జిల్లాల వారు జాగ్రత్త..

Advertiesment
Heavy Rains

బిబిసి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (17:29 IST)
“గురువారం తెల్లవారుజామున చెన్నై దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీంతో, నేడు (బుధవారం) దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి” అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
 
“ప్రస్తుతం వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో వాయుగుండం పయనిస్తోంది. బుధవారం 10 గంటల సమయానికి చెన్నైకి 360 కి.మీ దూరంలో, పుదుచ్చేరికి 390 కి.మీ, నెల్లూరుకు 450 కి.మీ దూరంలో ఉంది. గురువారం చెన్నై దగ్గర మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం బుధ, గురువారాల్లోనే ఉంటుంది. శుక్రవారం నుంచి సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి” అని కూర్మనాథ్‌ బీబీసీతో చెప్పారు. “ఈ రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. వాయుగుండం ప్రభావం ఉండే జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
 
ఏయే జిల్లాలపై ప్రభావం ఉంటుందంటే...
ఈ వాయుగుండం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలపై ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడొచ్చని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
 
వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. వాయుగుండం తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోం మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లాల యంత్రాంగాలు సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలను ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.
 
సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని ప్రతి మండలంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో భారీ వర్షాలు-ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు (video)