Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఫ్గానిస్తాన్‌లో కూలిన విమానం, అంతుబట్టని వివరాలు, రంగంలోకి దిగిన అమెరికా

Advertiesment
అఫ్గానిస్తాన్‌లో కూలిన విమానం, అంతుబట్టని వివరాలు, రంగంలోకి దిగిన అమెరికా
, సోమవారం, 27 జనవరి 2020 (22:11 IST)
తూర్పు అఫ్గానిస్తాన్ ప్రాంతంలో సోమవారం కుప్పకూలిన విమానం విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా విమానం ఆచూకీని తెలుసుకునేందుకు అమెరికా మిలటరీ రంగంలోకి దిగింది. రాజధాని నగరం కాబూల్‌కు నైరుతి దిశలో ఉన్న ఘజ్ని ప్రావిన్సులోని దెహ్ యాక్ జిల్లాలో కూలిన ఈ విమానం అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినదని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే అరియానా ఎయిర్‌లైన్స్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. దీంతో ప్రస్తుతం ఆ విమాన వివరాలు, ప్రమాదానికి కారణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 
అయితే ఇరాన్‌కు చెందిన ప్రముఖ వార్తా ఏజెన్సీ ఫార్స్ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మార్కింగ్స్ ఉన్న ఓ ఫుటేజ్‌ను చూపిస్తూ అందులో కనిపిస్తున్నవి కుప్పకూలిన విమాన శకలాలని పేర్కొంది. ఫార్స్ సోషల్ మీడియాలో కూడా అవే దృశ్యాలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. సాధారణంగా బాంబ్ రైడర్ ఈ-11ఎ జెట్ విమానాన్ని అఫ్గానిస్తాన్లో నిఘా సేవల నిమిత్తం ఉపయోగిస్తోంది అమెరికన్ సైన్యం.

 
విమానం కుప్పకూలిన ప్రదేశంగా భావిస్తున్న గ్రామం తాలిబాన్లకు మంచి పట్టున్న ప్రాంతం. ఈ విషయంలో ప్రస్తుతానికి తమకు కూడా ఎలాంటి స్పష్టత లేదని యూఎస్ ఆర్మీ అలాగే యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా తెలిపినట్టు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

 
మరోవైపు ప్రమాదంపై వస్తున్న నివేదికల గురించి తమకు తెలుసని, వాటిపై విచారణ జరపుతున్నామని, ఆ విమానం రక్షణ శాఖకు సంబంధించినదా కాదా అన్న విషయంలో, ప్రస్తుతానికి తామెలాంటి స్పష్టత ఇవ్వలేమని అమెరికా రక్షణ శాఖ అధికారులు మిలటరీ టైమ్స్‌కు తెలిపారు.

 
అలాగే ప్రమాదానికి గురైన విమాన వివరాలు, ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన కచ్చితమైన వివరాలేవీ తమ వద్ద లేదని అటు ఘజనీ ప్రావిన్షియల్ గవర్నర్ వాహిదుల్లా కలీమ్జాయ్ కూడా స్పష్టం చేశారు. ప్రయాణీకులతో కూడిన ఎటువంటి విమానం ప్రమాదానికి గురికాలేదని అఫ్గానిస్తాన్ ఏవియేషన్ విభాగం కూడా వెల్లడించింది.

 
మరోవైపు విమానం కూలినట్టు తమకు కూడా ఎలాంటి సమాచారం లేదని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుళ్లా ముజాహిద్ బీబీసీకి చెప్పారు. ఘజ్నీ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు కూడా ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని బీబీసీకి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ఆర్సీ వల్ల పౌరసత్వం పోతుందన్న భయాలు వద్దు: పవన్ కళ్యాణ్