Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..

webdunia
సోమవారం, 30 మార్చి 2020 (20:45 IST)
కరోనావైరస్ మనకు ఎప్పటినుంచో ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ, దీని గురించి మనలో చాలామందికి 2019 డిసెంబర్‌ నుంచే తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నా, మనకు ఈ వైరస్ గురించి పెద్దగా ఏమీ తెలీడం లేదు. ఇప్పుడు దీనికి సమాధానాలు వెతుకుతున్న ప్రపంచంలో మనం కూడా భాగ మైపోయాం.
 
దీనికి సంబంధించి కొన్ని సమాధానాలు లేని పెద్ద ప్రశ్నలు మిగిలిపోయాయి.

 
1. ఎంతమంది ప్రజలకు వ్యాపించింది
ఇది అత్యంత ప్రాథమిక ప్రశ్నల్లో ఒకటి. కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోవిడ్-19 కేసులను ధ్రువీకరిస్తున్నారు. కానీ మొత్తం పాజిటివ్ కేసుల్లో అవి ఒక చిన్న భాగం మాత్రమే. ప్రజల్లో వైరస్ ఉన్నప్పటికీ, ఆ లక్షణాలు కనిపించని కేసులు ఎన్ని ఉన్నాయో, ఆ గణాంకాలు అంతుపట్టకపోవడం అందరినీ మరింత గందరగోళపరుస్తోంది.

 
ఒక యాంటీబాడీ టెస్ట్ రూపొందించడం వల్ల ఎవరిలో అయినా వైరస్ ఉందా లేదా అనేది పరిశోధకులు చూడచ్చు. అలా చేయగలిగితే, కరోనావైరస్ ఎంత దూరం వరకూ చేరుతోంది, ఎంత సులభంగా వ్యాపిస్తోంది అనేది మనం తెలుసుకోగలం.

 
2. ఇది నిజంగా ఎంత ప్రాణాంతకం
ఇప్పటివరకూ కచ్చితంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో మనం గుర్తించేవరకూ, మరణాల రేటును కచ్చితంగా చెప్పడం అసాధ్యం. ప్రస్తుతానికి వైరస్ వ్యాపించిన వారిలో దాదాపు 1 శాతం మంది చనిపోతారని అంచనా వేస్తున్నారు. కానీ ఈ లక్షణాలు లేని రోగులు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ మరణాల రేటు తగ్గవచ్చు.

 
3. పూర్తి స్థాయి లక్షణాలు
కరోనావైరస్ ప్రధాన లక్షణం జ్వరం, పొడి దగ్గు. మనం బయట వెతకాల్సిన లక్షణాలు ఇవే. కొన్ని కేసుల్లో గొంతు పొడిబారడం, తలనొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు కూడా కనిపించాయి. కొందరిలో అయితే వాసన చూసే శక్తి కూడా కోల్పోవడం జరిగిందని చెప్పుకుంటున్నారు.

 
కానీ, వారికి స్వల్పంగా జలుబు లాంటి లక్షణాలు, అంటే, కొంతమంది రోగుల్లో ఉన్నట్లు ముక్కు కారడం, తుమ్ములు లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అనేది చూడడం చాలా ముఖ్యం. తాము వైరస్ క్యారీ చేస్తున్నామని తెలీకుండానే, జనం దాని ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 
4. వైరస్ వ్యాప్తిలో పిల్లల పాత్ర
కరోనావైరస్ కచ్చితంగా పిల్లలకు కూడా వ్యాపిస్తుంది. అయితే వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా వయసుల వారితో పోలిస్తే, ఈ వైరస్‌తో చనిపోయిన పిల్లల సంఖ్య చాలా తక్కువ. పిల్లలు సాధారణంగా ఈ వ్యాధి వేగంగా వ్యాపించేలా చేస్తారు. ఎందుకంటే వారు చాలా మంది(తరచూ ఆటస్థలాల్లో)తో కలిసిపోతుంటారు. కానీ, ఈ వైరస్‌తో ఉన్న పిల్లలు అది వ్యాపించేలా ఏమేరకు సహాయపడుతున్నారు అనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు.

 
5. ఇది సరిగ్గా ఎక్కడ నుంచి వచ్చింది.
అధికారికంగా సార్స్- CoV-2 అని పిలిచే కరోనావైరస్‌కు గబ్బిలాల్లో ఇన్ఫెక్షన్లు కలిగించే వైరస్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ వైరస్ గబ్బిలాల నుంచి ఒక అంతుపట్టని జంతు జాతికి వ్యాపించిందని.. తర్వాత ఇది మనుషుల్లోకి చేరిందని భావిస్తున్నారు. ఆ ‘మిస్సింగ్ లింకు’ ఇంకా అంతుబట్టడం లేదు. అది మరిన్ని ఇన్ఫెక్షన్లకు ఆధారంగా మారొచ్చు.

 
6. వేసవిలో ఈవైరస్ వ్యాప్తి తగ్గుతుందా?
వేసవిలో కంటే శీతాకాలంలో జలుబు, జ్వరాలు రావడం సర్వ సాధారణం. కానీ వెచ్చటి వాతావరణం వైరస్ వ్యాపించకుండా అడ్డుకుంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కరోనావైరస్‌ కాలానుగుణంగా ఏదైనా ప్రభావం ఉంటుందా అనేది కూడా స్పష్టంగా తెలీడం లేదు అని బ్రిటన్ ప్రభుత్వంలోని శాస్త్రీయ సలహాదారులు హెచ్చరిస్తున్నారు. అలా ఉన్నట్లయితే, వైరస్ ప్రభావం జలుబు, జ్వరం కంటే చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

 
వేసవికాలంలో కరోనావైరస్‌ తీవ్రత తగ్గినట్టు ఉంటే, ఆస్పత్రుల్లో సాధారణంగా శీతాకాలంలో వచ్చే వ్యాధుల రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుండే ప్రమాదం ఉంది.

 
7. కొంతమందిలో తీవ్రమైన లక్షణాలు ఎందుకు
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఎక్కువమందిలో స్వల్పంగా ఉంది. అయితే దాదాపు 20 శాతం మందిలో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఎందుకు? ఒక వ్యక్తిలో ఉండే రోగనిరోధక శక్తి స్థితి ఈ సమస్యకు కారణం అనిపిస్తోంది. అక్కడ కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉండచ్చు. వీటి గురించి తెలుసుకోవడం వల్ల కరోనా రోగులకు ఇంటెన్సివ్ కేర్ అవసరం లేని పద్ధతులకు దారితీయవచ్చు.

 
8. రోగనిరోధకశక్తి ఏమేరకు ఉంటుంది, మీకు ఇది రెండోసారి వస్తే
ఈ వైరస్‌కు రోగనిరోధక శక్తి ఎంత దృఢంగా ఉండాలి చాలా ఊహాగానాలు, తక్కువ ఆధారాలు ఉన్నాయి. కరోనాకు గురైన రోగులు వైరస్‌తో విజయవంతంగా పోరాడారంటే, వారు కచ్చితంగా తమ రోగనిరోధకశక్తిని పెంచుకునే ఉంటారు. కానీ, ఈ వైరస్ వచ్చి కొన్ని నెలలే కావడంతో, దీనిపై దీర్ఘకాలిక గణాంకాలు అందుబాటులో లేవు. రోగులకు చేసిన పరీక్షల్లో వైరస్‌ నుంచి వారు విముక్తి అయ్యారని తప్పుగా రావడం వల్ల రోగులు రెండుసార్లు ఇన్ఫెక్షన్‌కు గురయ్యారనే వదంతులు వ్యాపించి ఉండచ్చు. దీర్ఘకాలంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే, రోగనిరోధక శక్తి అనే ప్రశ్న చాలా కీలకం.

 
9. వైరస్ మార్పు చెందుతుందా
వైరస్‌లు ఎప్పుడూ మార్పు చెందుతుంటాయి. కానీ వాటి జన్యు కోడ్‌లో చాలా మార్పుల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండదు. సాధారణంగా వైరస్‌లు దీర్ఘకాలంలో తక్కువ ప్రాణాంతకమైనవిగా మార్పు చెందుతాయని మనం భావించవచ్చు. కానీ దానిని గ్యారంటీగా చెప్పలేం.
 
వైరస్ మార్పులకు గురైతే, అప్పుడు రోగనిరోధకశక్తి దానిని గుర్తించలేదు. ఒక నిర్దిష్ట వాక్సిన్ కూడా(ఫ్లూలో జరిగినట్లు) దానికి పనిచేయదు. ఇది ఆందోళనకరం.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

బియ్యం, కందిపప్పు పంపిణీతో వయోవృద్ధులు, చిన్నారుల కడుపు చల్లగా: డాక్టర్ కృతికా శుక్లా