Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు: విశాఖలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు

Advertiesment
ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు: విశాఖలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
, మంగళవారం, 21 జనవరి 2020 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదంతో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020కి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. ఈ మేరకు బిల్లులో కూడా వివరాలను పేర్కొన్నారు.

 
సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని వివరించారు. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

 
అమరావతికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కేబినెట్ పెంచింది. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పదేళ్లపాటు కౌలు చెల్లించాలనే గత నిర్ణయాన్ని సవరించింది.

 
వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సీఆర్‌డీఏ రద్దు బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన మూలస్తంభం చట్టసభలని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని మంత్రి బుగ్గన సభలో చెప్పారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉంటుందని, రాజ్‌భవన్, సచివాలయం విశాఖలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 
న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని, న్యాయపరమైన అన్ని శాఖలు కర్నూలులో ఉంటాయని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కన్నా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చిందన్నారు. లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.

 
"పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేయాలి. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి. న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు మీద నిర్ణయం ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి" అని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

 
అమరావతిపై నాకు కోపం లేదు - వైఎస్ జగన్
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రసంగం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. శివ రామ కృష్ణన్ కమిటీ నివేదికపై ఈటీవీ ప్రసారం చేసిన ఓ కథనాన్ని సైతం ఆయన సభలో చూపించారు. ''శివరామ కృష్ణన్ కమిటీ కూడా, విభజన తర్వాత ఏపీ అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం చేయవద్దని చెప్పింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలు అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆహార ధాన్యాగారాలను పాడు చేయొద్దని కమిటీ చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మల్టీ క్యాపిటల్ జోన్స్ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ సూచించారు. చంద్రబాబు నిర్ణయంతో ఆయన నిస్పృహకి గురయ్యారు'' అని జగన్ అన్నారు.

 
''రాజధానిలో కనీస సౌకర్యాలను కూడా చంద్రబాబు ఏర్పాటు చేయలేకపోయారు. మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం ఎకరానికి 2 కోట్ల చొప్పున లక్ష కోట్ల అంచనాలు వేశారు. 8 కిలో మీటర్ల వ్యాసంలో 53వేల ఎకరాలలో మౌలిక సదుపాయాల కోసమే లక్ష కోట్లు అవసరం అని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మార్చారు. 14 వేల కోట్లతో కొత్త సచివాలయం కోసం టెండర్లు పిలిచారు'' అని జగన్ పేర్కొన్నారు.

webdunia
''రాజధాని కోసం ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ. 5676 కోట్లు మాత్రమే., 5676 కోట్లను మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టారు. బకాయిలుగా రూ. 2297 కోట్లు చెల్లించకుండా చేతులు ఎత్తేశారు. ఏడాదికి 1200 కోట్లు చొప్పున ఖర్చు పెడితే చంద్రబాబు గ్రాఫిక్ రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పడుతుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఐదు రెట్ల వేగంతో పని చేస్తే 20ఏళ్ళలో పూర్తి అవుతుంది.

 
కృష్ణా, గుంటూరు జిల్లాలో 33మంది ఎమ్మెల్యేలలో 29 మందిని ప్రజలు గెలిపించారు. రాజకీయాలలో నిజాయితీ, చిత్తశుద్ది, మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. ఆర్థికంగా గడ్డు కాలంలో 8కి.మీ కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడం సమంజసమేనా. అమరావతి అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తాం. దాని టైం దానికి ఇస్తే ఇది మహా నగరం అవుతుంది. మనకు ఉన్న తక్కువ డబ్బుతో రాష్ట్రానికి మేలు చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాం.

 
విజయవాడ, గుంటూరులో 2వేల కోట్లు ఖర్చు చేస్తే ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. 1100కోట్లు ఇస్తే తాడేపల్లి, మంగళగిరి చక్కగా అభివృద్ధి చెందుతాయి. నా ఇల్లు కూడా అక్కడే ఉంది. కృష్ణా నది మీద వెళుతుంటే పరిస్థితి చూసి నాకు బాధ కలిగి రిటైనింగ్ వాల్‌కి వెంటనే డబ్బులు ఇచ్చాను. ప్రతి జిల్లాలో కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు. ఆర్థిక వ్యవస్థ అవకాశాల ఆధారంగా నడుస్తుంది.

 
మన వనరులు ఆధారంగా ప్రాధాన్యతలు ఉండాలి. ప్రజల్ని భ్రమల్లో ఉంచాల్సిన అవసరం లేదు. మరో బాహుబలి డైరెక్టర్‌ని భ్రమరవతి చేస్తా అంటూ తీసుకొచ్చి ప్రజలను మోసం చేయలేక నిజం చెబుతున్నా. లక్షా పది వేల కోట్లలో పదో వంతు ఖర్చు చేసినా పదేళ్ళలో అయినా హైదరాబాద్‌తో పోటీ పడగలము. మన పిల్లలకు అప్పుడైనా అవకాశాలు కల్పించగలుగుతాం.

 
ఇక్కడే ఉంటే ఐదేళ్ల తర్వాత మన పిల్లలకు, రాష్ట్రానికి ఏమి అవకాశాలు ఇవ్వగలమో ఆలోచించుకోవాలి. ఇక్కడ చేయడానికి శక్తి చాలదు, అక్కడ చేయకపోతే అవకాశాలు ఏమి ఉండవు. ఐదేళ్ల తర్వాత ఇక్కడే డబ్బు ఖర్చు చేస్తే మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోవాలి. బాధ్యతగా నిర్ణయాలు తీసుకోకపోతే మనం పూర్తిగా నష్టపోతాము. చంద్రబాబుకి తాను కొనుగోలు చేసిన భూముల మీదే ధ్యాసంతా ఉంది. రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాము.

 
అమరావతితో పాటు ఇతర ప్రాంతాలకు అభివృద్ధి చేస్తాము. ఇక్కడ న్యాయం చేస్తూ, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. రైతులు ఏవిధంగానూ నష్టపోయే పరిస్థితి తీసుకురాము. భూమి లేని పేదలకు 5 వేల పెన్షన్ ఇవ్వడం వల్ల 21 వేల కుటుంబాలకు మేలు కలగనుంది. అసైన్డ్ భూములు అన్నిటికి పట్టా భూములలో సమానంగా పరిహారం, ఫ్లాట్‌లు ఇస్తాం. సహజ సిద్ధంగా జరగాల్సిన అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది'' అని తన ప్రసంగంలో భాగంగా జగన్ వివరించారు.

 
17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 17మంది టీడీపీ ఎమ్మెల్యేలను సోమవారం రాత్రి స్పీకర్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వాళ్లలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు , నిమ్మకాయల చినరాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, రామకృష్ణ ప్రసాద్, బాల వీరంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్ తదితరులు ఉన్నారు.

webdunia
మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు - చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ వెళ్తే ఎలా అని అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప... పాలనా వికేంద్రీకరణ వల్ల అది సాధ్యం కాదని ఆయన అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... "సభలో నన్ను విమర్శించడానికే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పర్వాలేదు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. అదే మా సిద్ధాంతం. 

 
విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఉంది. మూడు రాజధానుల గురించి ఎక్కడా లేదు. శివరామకృష్ణన్‌ నివేదికలో కూడా ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదు. 46 శాతం విజయవాడ-గుంటూరు ప్రాంతంపై మొగ్గు చూపింది. తర్వాత విశాఖ వైపు ఆ కమిటీ మొగ్గు చూపింది. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదు" అని అన్నారు. దీనిపై బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినదానికి, చంద్రబాబు చెప్పినదానికి పొంతన లేదన్నారు.

 
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... "తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే మంత్రి చదివి వినిపించారు. కమిటీ నివేదికలో చివరికి ఏం చెప్పారనేది ముఖ్యం. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా రాజధానిగా విజయవాడ-గుంటూరును ఎంచుకుంది. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతారా? ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మాత్రం పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. చరిత్ర గురించి తెలియని వారు మాత్రమే దిల్లీ, చెన్నై రాజధానులు గురించి మాట్లాడుతున్నారు. దిల్లీ నడిబొడ్డులోనే పార్లమెంటు ఉంది. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి అనేది చేస్తేనే జరుగుతుంది'' అని ఆయన అన్నారు.

 
‘‘రాజధాని తాత్కాలికం అని ఎప్పుడూ అనలేదు. ట్రాన్సిట్ అసెంబ్లీ అని మాత్రమే చెప్పాను. అసెంబ్లీ భవనం తాత్కాలికం కాదు, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మాత్రమే ఉంది, రాజధానులు అని లేవు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ మొత్తం బోగస్. భవిష్యత్‌లో ఐకానిక్ నిర్మాణాలు చేస్తామని చెబితే వైసీపీ వారికి అర్థం కాలేదు’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

 
4070 ఎకరాలు రాజధాని ప్రకటనకు ముందే కొన్నారు: బుగ్గన
చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లో ఏర్పడిందని, రాజధానిని డిసెంబరులో ప్రకటించారని, రాజధాని ప్రకటనకు ముందే ఇప్పుడు రాజధాని ఉన్న ప్రాంతంలో 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి బినామీలు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన సభలో ఆరోపించారు. అధికారిక సమాచారం ప్రకారం 4070 ఎకరాలు అని, వాస్తవానికి ఇంతకన్నా పెద్దమొత్తంలో టీడీపీ నాయకులు, బినామీలు భూములు కొన్నారని, ఇదంతా 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' అని ఆయన ఆరోపించారు.

 
ఇలా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, మురళీమోహన్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, వారి బంధువులు, పుట్టా మహేష్ యాదవ్, లింగమనేని రమేశ్, జీవీఎస్ ఆంజనేయులు, వేమూరి రవి కుమార్, వేమూరి ప్రసాద్, యార్లగడ్డ రవికిరణ్, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు.

 
లంక భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు సహా ఏ భూములనూ వదిలిపెట్టలేదని, ఇది రాజధాని నిర్మాణమా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటిష్ పాలనలో కోట్ల రూపాయల పన్ను వసూళ్లు లండన్ తరలించి మహా సౌధాలు నిర్మించుకున్నారని, భారతీయులు కనీస అవసరాలకు నోచుకోక పోరాటం చేయాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. ఆధునిక కాలంలో పాలకులు అలాంటి పొరపాట్లు చేయకూడదన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు హయాంలో ఎక్కడా పెద్ద కోటలు నిర్మించలేదని, కానీ అప్పుడు తవ్విన చెరువులు ఇప్పటికీ ఉన్నాయని పేర్కొన్నారు.

 
పయ్యావుల కేశవ్ - బుగ్గన మధ్య మాటల యుద్ధం
మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య వాగ్వాదం నెలకొంది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై పయ్యావుల కేశవ్‌ స్పందించారు. బినామీ ఆస్తులంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బినామీ చట్టం కింద బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్‌ చేద్దామా? అని సవాలు విసిరారు.
webdunia

 
రాజధానిలో ఇల్లు ఉండాలని భూమి కొనడం తప్పా? అని ప్రశ్నించారు. తన కుమారుల పేరుతోనే అక్కడ భూమి కొన్నానని, బినామీ పేర్లతో కాదన్నారు. మీరు చెబుతున్న బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపి, ఆ భూములు అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవ్వండన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి దీనిపై స్పందించారు. కేవలం ఒక ఇల్లు కట్టుకోవడానికి అంత భూమి అవసరమా? అని ప్రశ్నించారు. డిసెంబర్‌లో సీఆర్‌డీఏ బిల్లు ఆమోదం పొందితే అంతకుముందే భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లు కట్టుకోవడానికి 4 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిన మాట వాస్తవమని, తెదేపా నేతలు తప్పు చేశామని అంగీకరించాలన్నారు.

 
'బోస్టన్ కమిటీకి చట్టబద్ధత ఉందా?': టీడీపీ
ఏ జీవో ప్రకారం బోస్టన్‌ గ్రూప్‌ కమిటీని నియమించారని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "ఆ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదు, వారు ఇచ్చింది తప్పుడు నివేదిక" అని ఆయన అన్నారు. ఒక సామాజిక వర్గానికే అమరావతి ఉపయోగపడుతుందంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 75 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎన్టీ మైనార్టీలే ఉన్నారని రామానాయుడు చెప్పారు.

 
జనసేన ఎమ్మెల్యే ఏమన్నారు?
రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి ఉన్నతమైన నిర్ణయం ఉన్నతమైన వ్యక్తులకే వస్తాయని రాపాక వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే మూడు రాజధానులకే అనుకూలంగా స్పందన వస్తుందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ, లోతుగా ఆలోచిస్తే ఆయన కూడా మూడు రాజధానులను స్వాగతిస్తారని ఎమ్మెల్యే రాపాక అన్నారు.
webdunia

 
రైతులకు, కూలీలకు నష్టం జరగదు: హోంమంత్రి
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గుంటూరు జిల్లావాసిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్ట హోంమంత్రి సుచరిత చెప్పారు. ఎలాంటి పక్షపాతం లేకుండా తమ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందని, మూడు రాజధానుల నిర్ణయంతో శతాబ్దాల భవిష్యత్తుకు చక్కని పునాది పడుతుందని శాసనసభలో అన్నారు.

 
"ప్రాంతీయ అసమానతలు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అన్ని సాంతాల ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చూడాల్సిన బాధ్య అందరిపైనా ఉంది. రైతులకు, రైతు కూలీలకు కష్టం, నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం" అని సుచరిత వివరించారు.

 
సచివాలయం ముట్టడికి ప్రజల యత్నం
మరోవైపు రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు సచివాలయం ముట్టడికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకొంటున్నారు. పలు చోట్ల తోపులాటలు జరిగాయి. కొందరు మహిళలు గాయపడ్డారు.

 
పెద్దయెత్తున పోలీసుల మోహరింపు
కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్దయెత్తున పోలీసులను మోహరించింది. రాజధాని పరిధిలోని మందడంలో గ్రామస్థులు నల్లజెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. గుంటూరులో సోమవారం ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు డేగల ప్రభాకర, నసీర్, మల్లి, కనపర్తి, గోళ్ళ ప్రభాకర్ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. వాహనాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే బ్యారేజ్ మీదకు అనుమతిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అమరావతి సంయుక్త కార్యాచరణ సమితి ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, జేఏసీ ప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముందస్తు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. మందడం సహా, పలు గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

 
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ శాసనసభ వద్ద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళనలో పాల్గొన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. "ఒక రాష్ట్రం-ఒకే రాజధాని" అనేది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, భావితరాల కోసo పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోబోమన్నారు.
webdunia

 
శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలను అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయ ప్రాంతంలో రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో చెప్పారు. 13 జిల్లాలను అభివృద్ధి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వనరులు అన్నీ ఒకే ప్రాంతానికి కేటాయించడం మంచిది కాదని భావించి సీఆర్‌డీఏ రద్దుకు నిర్ణయించామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తామన్నారు.

 
భూముల కొనుగోళ్లు, కేటాయింపులకు సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సభాపతిగా తాను కోరుతున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై విపక్ష టీడీపీ అభ్యంతరాలు చేసింది. ఈ సందర్భంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ- మీ(స్పీకర్) ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చేస్తామని ప్రకటించారు. స్పీకర్ 'క్వాజీ-జ్యుడిషియల్' అథారిటీ అని, న్యాయమూర్తి వంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను బూతులు తిట్టిస్తారా? వైఎస్సార్ లాంటి మరణం కావాలని కోరుకుంటా?