Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Digital Rupee: డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

Rupee
, బుధవారం, 30 నవంబరు 2022 (14:48 IST)
డిజిటల్ రూపాయిని (ఈ-రూపీ) డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. మొదట రిటైల్ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు తెలిపింది. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ డినామినేషన్లలోనే దీన్ని కూడా జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో డిజిటల్ రూపాయి అంటే ఏంటి? అది ఎలా ఉంటుందో చూద్దాం? డిజిటల్ రూపాయి అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మాములు డబ్బుల మాదిరిగానే ఇదీ పని చేస్తుంది. దీని విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీ మాదిరిగానే ఉంటుంది.

 
డిజిటల్ రూపాయి అవసరం ఏంటి?
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్‌బీఐ డిజిటల్ రూపాయి తీసుకొస్తోంది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు.

 
ఆఫ్‌లైన్‌లోనూ వాడొచ్చు
డిజిటల్ రూపాయిని ఆఫ్‌లైన్ విధానంలోనూ వాడొచ్చు. కాబట్టి విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా అది పని చేస్తుంది.

 
సీబీడీసీ అంటే?
సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తీసుకొచ్చే చట్టబద్ధమైన కరెన్సీ. ఇది కూడా పేపర్ కరెన్సీ వంటిదే. సీబీడీసీలను ఆర్‌బీఐ నేరుగా జారీ చేయడంతోపాటు వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇక బ్యాంకులు కేవైసీ, అకౌంట్ కీపింగ్ వంటి నిర్వహణ పరమైన కార్యకలాపాలు చూసుకుంటాయి.

 
డిజిటల్ రూపాయి ఎలా ఉంటుంది?
ఆర్‌బీఐ చెబుతున్న ప్రకారం... డిజిటల్ రూపాయి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి టోకెన్ ఆధారిత డిజిటల్ రూపాయి. ఇది కరెన్సీ నోటు వంటిదే. ఎవరి దగ్గర ఉంటే వారే దాని యజమానులు. రిటైల్ లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక రకంగా భౌతిక నగదు వంటిది. రెండు అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపాయి. దీన్ని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వాడటానికి అనుమతి ఉంటుంది. టోకు లావాదేవీలు లేదా బ్యాంకుల మధ్య లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు.

 
డిజిటల్ రూపాయి కూడా క్రిప్టో కరెన్సీ వంటిదేనా?
డిజిటల్ రూపాయి అనేది క్రిప్టో కరెన్సీ కాదు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపాయిని మైనింగ్ చేయలేరు. క్రిప్టో కరెన్సీలో వాడే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని డిజిటల్ రూపాయిలో కూడా వాడొచ్చు. కానీ వాడతామని మాత్రం ఆర్‌బీఐ కచ్చితంగా చెప్పలేదు. బిట్‌కాయిన్, ఇథేరియం వంటి క్రిప్టోకరెన్సీల మీద ఎవరి నియంత్రణ ఉండదు. కానీ డిజిటల్ రూపాయి మీద మాత్రం ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది.

 
ఎవరు వాడొచ్చు?
డిజిటల్ రూపాయిని ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బ్యాంకులు దాన్ని పంపిణీ చేస్తాయి. టోకెన్ ఆధారిత డిజిటల్ రూపాయిని రిటైల్ లావాదేవీలకు వాడతారు.

 
వడ్డీ వస్తుందా?
ఆర్‌బీఐ జారీ చేసిన కాన్సెప్ట్ నోట్ ప్రకారం వాలెట్ ఉంచే డిజిటల్ రూపాయి మీద వడ్డీ చెల్లించరు. అలా చేయడం వల్ల బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా తీసి డిజిటల్ రూపాయి రూపంలో పొదుపు చేయడం మొదలు పెడతారు. అది బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం చేస్తుంది.

 
ఇతర పేమెంట్స్‌తో పోలిస్తే ఎంత మెరుగు?
డిజిటల్ రూపాయిని వాడటం వల్ల ఇంటర్ బ్యాంక్ సెటిల్‌మెంట్స్ అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీలలో బ్యాంకుల మధ్యవర్తిత్వం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో రియల్ టైంలో లావాదేవీలు పూర్తి అవుతాయి. ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే వారికి ఇది చాలా సులభంగా ఉంటుంది. మధ్యవర్తులు ఎవరూ లేకుండానే డిజిటల్ డాలర్ల రూపంలో సులభంగా చెల్లింపులు చేయొచ్చు.

 
సామాన్య ప్రజలకు లాభం ఏంటి?
ఇతర దేశాల్లో పని చేసే వాళ్లు డిజిటల్ రూపాయి సాయంతో తక్కువ ఖర్చుతో దేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపొచ్చు.

 
ఎన్ని దేశాలు డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నాయి?
ప్రపంచంలో 100కు పైగా దేశాలు డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. ప్రస్తుతం నైజీరియా, జమైకాతో సహా 10 దేశాలు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చాయి. 2023లో చైనా డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. జీ20 గ్రూపులోని 19 దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 
డిజిటల్ కరెన్సీ ఎంత సురక్షితం?
ప్రభుత్వ హామీ ఉండే డిజిటల్ కరెన్సీలో రిస్క్ ఉండదని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. 27 సభ్య దేశాల్లో యురోపియన్ యూనియన్ త్వరలోనే డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. ఒకవేళ తాము డిజిటల్ కరెన్సీ తీసుకొస్తే అది అత్యంత సురక్షితంగా ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వు చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

48,500 నాటి పురాతన zombie virus.. అంటువ్యాధిగా మారితే?