Publish Date: Mon, 22 Apr 2019 (17:20 IST)
Updated Date: Mon, 22 Apr 2019 (17:27 IST)
కూరల్లో లేదా రసంలో చింతపండును ఉపయోగించేటప్పుడు పండును మాత్రం తీసుకుని గింజలను పారేస్తుంటాం. చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలిస్తే మీరు పారవేయరు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. సాధారణంగా అధిక బరువు వలన లేదా వయస్సు మీదపడటం వలన మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు చింత గింజల పొడిని తీసుకుంటే మంచిది.
పుచ్చులు లేని చింతగింజలను తీసుకుని పెనం మీద బాగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని నీటిలో రెండురోజుల పాటు నానబెట్టాలి. రోజూ రెండు పూటలా నీటిని మార్చాలి. నానిన గింజల పొట్టు తీసివేసి, పొడి చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ పొడిని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ చొప్పున పాలలో లేదా నీళ్లలో వేసి చక్కెర లేదా నెయ్యి కలిపి తీసుకోవాలి.
ఇలా రోజూ చేస్తే రెండు మూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.