'దొంగ స్వాములకు జెడ్+ సెక్యూరిటీనా?' అంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్యమంత్రి జగన్ ను నిలదీశారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.... "అవినీతిపరులకు, నేరస్తులకు ఆశ్రయం ఇస్తున్న విశాఖ శారదాపీఠం స్వామి దొంగ స్వామి కాదా?
విజయవాడ దుర్గమ్మ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను, అధికారులను కాపాడడానికి శారదాపీఠం నేత రంగంలోకి దిగడం వాస్తవం కాదా? వైసీపీ నేతల అవినీతి సొమ్మును శారదాపీఠంలో డంప్ చేసినందుకే శారదాపీఠం నేతకు జెడ్+ సెక్యూరిటీ కల్పించలేదా?
ఏ స్వామికీ లేని జెడ్+ సెక్యూరిటీ శారదాపీఠం నేతకు కల్పించాల్సిన అవసరం ఏమిటి? స్వామీజీల గురించి మాట్లాడే అర్హత వైకాపా మంత్రులకు లేదు. రాష్ట్రంలో 168 దేవాలయాలపై దాడులకు పాల్పడినప్పుడు ఒక్క మంత్రయినా స్పందించారా?
దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? మీ యొక్క వైఫల్యాలు, నేర రాజకీయాలు కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతున్నారు. దేవాలయాల్లో భద్రతా చర్యలపై ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగానీ, దేవాదాయ శాఖామంత్రి గానీ సమీక్ష చేశారా? దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడంపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేకపోవడం సిగ్గుచేటు.
తిరుమల పవిత్రతను కాపాడింది, ఏడుకొండలకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తిరుమలలో బూట్లు వేసుకుని ప్రవేశించి తిరుమలను అపవిత్రం చేసింది ఏడుకొండలను రెండు కొండలుగా మార్చే ప్రయత్నం చేసింది జగన్‌రెడ్డి & కో కాదా?
ఎస్వీబీసీ, టీటీడీ ప్రచురణల్లో అన్యమత ప్రచారం చేసింది జగన్ ప్రభుత్వం కాదా? పింక్ డైమండ్‌పై తిరుమల ప్రతిష్టకే భంగం వాటిల్లేలా దుష్ప్రచారం చేశారు" అని మండిపడ్డారు.