Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ ముంచారు... ఏపీకి అన్యాయం జరిగింది : విజయసాయిరెడ్డి

మోడీ ముంచారు... ఏపీకి అన్యాయం జరిగింది : విజయసాయిరెడ్డి
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (17:20 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తలేదు. ముఖ్యంగా, విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ఏమాత్రం ఉపశమన చర్యలు చేపట్టలేదు. ఈ బడ్జెట్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెదవి విరిచారు. మోడీ ముంచారంటూ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
కాగా, బడ్జెట్‌లో ఏపీపై సవతి ప్రేమను ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ తమను ఎంతో నిరాశ పరిచిందన్నారు. ఇది పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు బడ్జెట్ అని... ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్ అని చెప్పారు. అన్ని విషయాల్లో ఏపీకి మొండి చేయి చూపించారని విమర్శించారు.
 
పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలపై బడ్జెట్‌లో ప్రస్తావించలేదని విజయసాయి దుయ్యబట్టారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుపై మాట్లాడలేదని అన్నారు. విజయవాడ-ఖరగ్‌పూర్ రవాణా కారిడార్ వల్ల ప్రయోజనం లేదన్నారు. ఎక్కువ సంఖ్యలో కిసాన్ రైళ్లను వేయాలని కోరినా పట్టించుకోలేదని, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. 
 
ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రానికి ఒక్క ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఏపీలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. కానీ కేంద్రం ఇవేమీ పట్టించుకోలేదు.
 
అలాగే, వైకాపా ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడం నిరాశ కలిగించిందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్‌ ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశ పరిచిందన్నారు. ఉపాధి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు  రెవెన్యూ లోటు ఉందని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?