ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి, తక్షణమే పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని కోరారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలంటూ సీఎంకు వివిధ అంశాలపై రోజూ లేఖలు రాస్తున్న ఆయన.. గురువారం పేదల ఇళ్ల నిర్మాణంపై ఎనిమిదో లేఖ రాశారు.
వైఎస్సార్ జగనన్న ఇళ్ల కాలనీలను వెంటనే నిర్మించి, పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు. గత ఎన్నికల సమయంలో పాలకొల్లు బహిరంగ సభలో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ 25 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పేదలంతా తమకు ఇళ్లు వస్తాయన్న ఆశతో ఎన్నికల్లో సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వైసీపీ విజయానికి కారణమయ్యారని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక 30.6లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారని, పీఎంఏవై కింద కేంద్రం మంజూరు చేసిన నిధులు కూడా ఇందులో అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేంద్రం నిధులు కూడా వాడుకుంటూ.. మొత్తం ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్రమే చేపడుతున్నట్లు చెప్పుకోవడాన్ని రఘురామరాజు ఆక్షేపించారు.
30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.70 వేలకోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి, బడ్జెట్‌లో కేవలం రూ.5 వేలకోట్లే కేటాయించారని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడానికి ఈ నిధులు ఎలా సరిపోతాయని, పేదలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత వ్యవధిలో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
పేదల ఇళ్ల పేరుతో దాదాపు రూ.10-11వేల కోట్ల వ్యయంతో ఆవ భూములను సేకరించారని, భూసేకరణ ప్రక్రియలో స్థానిక నేతలతో పాటు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రవేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు.
ఇప్పటివరకు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. గతప్రభుత్వం కంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రఘురామరాజు లేఖలో జగన్‌ను కోరారు.