ముంబై నటిపై వేధింపుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలను మంగళవారం ఆయన ఖండించారు. ఈ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
"ముంబై నటికి వేధింపులు.. అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి సాయం" అంటూ వస్తున్న కథనాలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ కథనంలో నేరుగా తనపై ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనాల్లో నిజం లేదన్నారు.
టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం, దాని మిత్రపక్ష మీడియా మానిఫెస్టోలో అమలు చేయని హామీలు, పెరుగుతున్న హింస, హత్యలు, ఆస్తుల విధ్వంసం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రచారంలో నిమగ్నమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని కించపరచడమే లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు అని సజ్జల చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా స్థానిక మీడియా కథనాలు అల్లిస్తోందని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా, ఇతర ఛానెల్‌ల ద్వారా ఈ తప్పుడు సమాచారాన్ని విస్తరించినందుకు అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తుందన్నారు.