ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు జరగాల్సివుంది. అయితే, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలు వెళ్లనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, అనేక మంది వైకాపా నేతలకు రాష్ట్రంలో నానాటికీ పెల్లుబికిపోతున్న ప్రజాగ్రహాన్ని గ్రహించి అనేక మంది వైకాపా నేతలు పక్క చూపులు చూస్తున్నారు.
ఇలాంటి వారిలో మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న మంగళగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైకాపా నేత కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
ఆయన టీడీపీ చేరబోతున్నట్టు మంగళగిరి పట్టణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గని మున్సిపల్ అధికారులు వైకాపా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. దీంతో టీడీపీ, వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
కాగా, కాండ్రు శ్రీనివాసరావు వైకాపా పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన గత కొంతకాలంగా వైకాపాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ చేరేందుకు సిద్ధమయ్యారు.