తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి కొత్త కూడిక చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలతో, పెద్దాయనకు ఆప్త మిత్రులైన వారితో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆహ్వానం పంపారని సమాచారం.
సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, విజయమ్మ ఆహ్వానాలలో తెలిపారు.
కేవలం కేబినెట్ మంత్రులే కాకుండా, వైఎస్ కు అత్యంత ఆప్తులు, నమ్మకస్తులను కూడా ఆమె ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది.
2009లో వైఎస్ఆర్ చనిపోగా, ఇప్పటి వరకు ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఎపుడూ ఆహ్వానించ లేదు. వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెల్లి షర్మిల తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతుండగా, ఇలాంటి సమయంలో విజయమ్మ భర్త వర్ధంతి రోజున సమావేశానికి ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే, విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆవిర్భావ సభలో కూడా విజయమ్మ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేయగా, ఇప్పుడు ఆహ్వానం పంపిన వారిలో ఎక్కువ శాతం ఆ పార్టీ నేతలే ఉన్నారు. ఈ సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాల్ని సృష్టించనుందన్నది ఆసక్తికరంగా మారింది.