మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) దారుణహత్యకు గురయ్యారు. ఏపీలోని వైఎస్సార్ కడపజిల్లా పులివెందులలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున విగతజీవిగా పడివున్న ఆయనను వ్యక్తిగత సహాయకుడు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతిచెందారని తొలుత భావించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో హత్యగా వెల్లడైనట్టు పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు శనివారం పులివెందులలో ముగిశాయి. వివేకా తండ్రి రాజారెడ్డి సమాధి(రాజాఘాట్) వద్దే ఆయన అంత్రక్రియలు నిర్వహించారు. ఉదయం వివేకా ఇంటి వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని వాహనం ఎక్కించి అంతిమయాత్ర ప్రారంభించారు. వివేకాను కడసారి చూసేందుకు వైఎస్ అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో పులివెందుల జనసంద్రంగా మారింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివేకా అంత్యక్రియలు ముగిశాయి.
ఇకపోతే.. బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటంతో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించి ఉండొచ్చని తొలుత భావించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆయన హత్యకు గురయ్యారని, శరీరంలో ఏడుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. సౌమ్యుడిగా పేరున్న వివేకానందరెడ్డిని హత్య చేయాల్సి అవసరం ఎవరికొచ్చిందన్న అనుమానాలు నెలకొన్నాయి.
వివేకా హత్యపై రాష్ట్రప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుచేసింది. పోలీసులు డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీమ్స్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే కేసును సీబీఐతో విచారణ చేయించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఆదినారాయణరెడ్డి స్కెచ్‌తోనే వివేకా హత్యకు గురయ్యారని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. మరోవైపు వైసీపీ నేతల ఆరోపణలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన వివేకానందరెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో నిష్పాక్షికంగా దర్యాఫ్తును సాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తమకెంతో ముఖ్యుడైన వివేకా మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులమంతా దీనిపై లోతైన దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇంకా వివేకా హత్యపై సీబీఐచే విచారణ జరిపించాలని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.