మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఇంటి వాచ్‌మెన్ రంగన్న అలియాస్ రంగయ్య కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. ఇది అనేక మంది నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది.
రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురు నలుగురు వ్యక్తులు ఈ హత్య కేసులో సూత్రధారులుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిపై (వివేకా ముఖ్య అనుచరుడు) తొలిసారి స్పందించారు.
రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తాను ఎవరినీ బెదిరించలేదన్నారు. వివేకానంద రెడ్డికి ద్రోహం చేసే వ్యక్తిని కాదని... ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను బెదిరించినట్టు ఇప్పటి వరకు కడపలో కానీ, పులివెందులలో కానీ కేసులు లేవని అన్నారు.
ఇదిలావుంటే, వివేకాది సుపారి హత్య అని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు తన పేరును వెల్లడిస్తే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అందుకే భయపడి తాను ఏమీ చెప్పలేదని అన్నారు. తనపై ఈగ కూడా వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారని తెలిపారు.
మరోవైపు ఈ హత్య వెనుక ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారని రంగన్న చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రంగన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.