తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టనున్నారా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా తెలంగాణలో షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారా..? తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో... షర్మిల పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
త్వరలో పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారనే ప్రచారమూ జరుగుతోంది. ఆమె కొత్త పార్టీకి వైసీపీ పేరు పెడతారా... లేక వైఎస్‌ఆర్ పేరు వచ్చేలా నామకరణం చేస్తారా అన్నది త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే షర్మిల పార్టీ జెండా కూడా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.
ఆకుపచ్చ, తెలుపు రంగుల కలబోతగా జెండా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షర్మిల పార్టీ రాకతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ మేరకు మారతాయన్న విశ్లేషణలు సైతం అప్పుడే ఊపందుకుంటున్నాయి.
తెలంగాణలో వైఎస్‌కు భారీగా అభిమానులున్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ అభిమానాన్ని అందిపుచ్చుకునేందుకే షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో షర్మిల పార్టీ అనుసంధానంగా ఉంటుందా..? లేక స్వతంత్రంగానే వ్యవహరిస్తుందా..? అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మొత్తం మీద షర్మిల పార్టీ తెలంగాణకే పరిమితమవుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. షర్మిల పార్టీతో తెలంగాణలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.