ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోనే ఉంటారు.
గురువారం ఒకటో తేదీన కడపకు చేరుకునే ఆయన సెప్టెంబరు రెండో తేదీన ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ వర్థింతి వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన పులివెందుల అభివృద్ధి పనులపై స్థానిక అధికారులు, పార్టీ నేతలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సీఎంవో బుధవారం విడుదలచేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు ఒకటో తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్... గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3.20 గంటలకు కడపకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సాయంత్రం 5.35 గంటలకు వేంపల్లి మండలంలోని తన సొంత ఎస్టేట్ ఇడుపులపాయకు చేరుకుంటారు.
గురువారం రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్న జగన్... శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 9.40 గంటల వరకు తన తండ్రి వర్థంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు.
పిమ్మట అధికారులతో సమీక్ష తర్వాత సాయంత్రం తిరిగి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత శనివారం ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.10 గంటలకు గవన్నరం ఎయిర్‌పోర్టు చేరుకుని... అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకుంటారు.