ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్‌ను దాఖలు చేశారు.
బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, రఘురామరాజుకు ఈ కేసుతో సంబంధం లేదన్నారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తుచేశారు.
మరోవైపు, రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు లేఖ కూడా రాశారని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామపై ఏపీలో అనేక కేసులున్నాయన్నారు.
ఆచంట, నర్సాపురం, పెనుగొండ, పెనుమంట్ర, భీమవరం పోలీస్ స్టేషన్‌లలో కేసులున్నాయని తెలిపారు. ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడంతో సీబీఐ కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాలను పిటిషనర్ కోర్టు ముందు దాచారన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని పేర్కొంటూ జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.
కౌంటర్ దాఖలు దాఖలు చేయాలని సీబీఐ కోర్టు గతంలోనే ఆదేశించినా... కొన్ని కారణాల వల్ల ఆయన తరపు న్యాయవాదులు మూడు వాయిదాల వరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. దీంతో, గత విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోయినా... విచారణను ప్రారంభిస్తామని హెచ్చరించింది. దీంతో, మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు.
అలాగే, రఘురామ రాజు తరపు న్యాయవాది కోర్టును 10 రోజుల గడువు కోరారు. జగన్ బెయిల్ షరతులను అడ్డదిడ్డంగా ఉల్లంఘించారని, వాటిని కోర్టు ముందు ఉంచేందుకు 10 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదావేసింది. అలాగే, సీబీఐ తరపు న్యాయవాదులు కూడా జగన్ బెయిల్ రద్దుపై స్పష్టత ఇవ్వాలని రఘురామ రాజు తరపు న్యాయవాది కోరారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో జగన్ తరఫు న్యాయవాదులు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు.