కరోనా కాలం లాక్ డౌన్ కారణంగా.. పలు కార్యక్రమాలు వాయిదా పడుతూ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న 'జగనన్న విద్యాకానుక' కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.
ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకను కూడా స్కూళ్లు ప్రారంభించే సమయంలోనే అందించాలని నిర్ణయించింది.
అసలు ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 5 నుంచే ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని అనుకున్నామని పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. అదే రోజున.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 'జగనన్న విద్యా కానుక' అందిస్తామని అనుకున్నామని చెప్పారు.
అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ - 19 అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబరు 30 దాకా పాఠశాలలు తెరవకూడదని తెలిపింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 5వ తేది నాటికి వాయిదా వేస్తున్నామని చినవీరభద్రుడు తెలిపారు.