Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులపై కేసులు పెట్టడం వైసిపి రాక్షసత్వం: మండిపడ్డ చంద్రబాబు

Advertiesment
రైతులపై కేసులు పెట్టడం వైసిపి రాక్షసత్వం: మండిపడ్డ చంద్రబాబు
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:52 IST)
నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గం టిడిపి నాయకులతో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష జరిపారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతులపై కేసులు పెట్టడం రాక్షస చర్య. నెల్లూరు జిల్లాలో 15మంది రైతులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. అమరావతిలో వందలాది రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఏడాదిలో రైతులపై ఇన్ని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు.

ఉచిత విద్యుత్ రైతుల హక్కు, పోరాడి సాధించుకున్న హక్కు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడం రైతులకు నమ్మకద్రోహం చేయడమే..ధాన్యం, పత్తి మిర్చి, పసుపు, ఏ పంటకూ సరైన ధర లేదు..వరద ముంపులో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు లేవు. రైతు ఆత్మహత్యల్లో ఏపిని 2వ స్థానానికి తెచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆందోళన చేస్తున్న రైతులకు టిడిపి అండగా ఉండాలి.
 
ఇళ్లస్థలాలకు భూసేకరణలో రూ 4వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 10-16అడుగుల లోతు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారట, వాటిని మెరక చేసేందుకు రూ 2వేల కోట్ల నరేగా నిధులు స్వాహా చేశారు. ఇటీవల వరదలకు ఆ భూములన్నీ నీట మునిగాయి, మెడలోతు నీళ్లలో ఇళ్లెలా కట్టుకుంటామని లబ్దిదారులే నిలదీస్తున్నారు. 

మట్టిరోడ్డు అనేది లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి సిమెంట్ రోడ్లు వేస్తే వాటికి బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం. రెండేళ్ల క్రితం గ్రామాల్లో చేసిన నరేగా పనులకు బిల్లులు చెల్లించరు. పనులు చేయకుండానే వైసిపి నాయకులు మాత్రం బిల్లులు చేసుకుంటున్నారు. ఇళ్లస్థలాల ల్యాండ్ లెవలింగ్ పేరుతో నరేగా నిధులు వేలకోట్లు స్వాహా చేస్తున్నారు.

సిబిఐ విచారణ టిడిపి హయాంపైనే కాదు, గత 16నెలల వైసిపి అవినీతిపై కూడా చేయాలి. విశాఖ భూముల్లో వన్ సైడ్ ట్రేడింగ్ పై విచారణ చేయాలి. నాసిరకం మద్యం బ్రాండ్ల వన్ సైడ్ ట్రేడింగ్ పై దర్యాప్తు చేయాలి. జె ట్యాక్స్ వసూళ్లపై విచారణ జరపాలి. 

16నెలల్లో 16% ఓటింగ్ వైసిపికి దూరం అయ్యింది. గ్రామాల్లో దాడులు, దౌర్జన్యాలతో బీసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటిలంతా వైసిపికి దూరం అయ్యారు. పెట్రోల్, డిజిల్ ధరలు 2నెలల్లో 2సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 3రెట్లు పెంచారు. ఇసుక  సిమెంట్ ధరలు విపరీతంగా పెంచేశారు. మద్యం ధరలు 300% పెంచారు. నీటితీరువా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఏడాదిలోనే రూ50వేల కోట్ల భారం వేశారు. 
 
పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా, అక్కడ నుంచి అక్రమ మద్యం సరఫరా వైసిపి నాయకులకు నిత్యకృత్యం అయ్యింది. ప్రతిరోజూ వందలాది లారీల ఇసుక తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి సరఫరా చేస్తున్నారు. 

టిడిపి పాలనపై, వైసిపి పాలనపై ప్రజల్లో డిబేట్ చేయాలి. టిడిపి ప్రభుత్వం ఉంటే కరోనాలో ప్రజలను ఇలా గాలికి వదిలేసేవాళ్లమా..? హుద్ హుద్, తిత్లి విపత్తు బాధితులను టిడిపి ఎలా ఆదుకుంది..? ఇప్పుడు కరోనా బాధితులను, వరద బాధితులను వైసిపి ఎలా నిర్లక్ష్యం చేస్తోందీ ప్రజలకు వివరించాలి.

మనుషులకే కాదు, దేవుళ్లకు కూడా వైసిపి పాలనలో రక్షణ లేదు. కులద్వేషాలు, మతద్వేషాలు మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా...? దేవాలయాలపై ఇన్నిదాడులు రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగాయా..?  ఆలయాలపై వరుస దాడులు చూస్తుంటే రాక్షస కాలం గుర్తొస్తోంది. రాక్షసుల కాలంలో కూడా ఇన్ని ఆగడాలు లేవు. 

దేవుడి కార్యక్రమాలకు ఆంక్షలు పెడతారు. వినాయక చవితి వేడుకలకు షరతులు విధిస్తారు.  వాళ్ల నాయన రాజశేఖర రెడ్డి 20వ వర్దంతికి మాత్రం ఆంక్షలు లేకుండా జీవోలు ఇస్తారు. దళితులపై ఇటువంటి దమనకాండ గతంలో ఎప్పుడైనా ఉందా..? హత్యలు, గ్యాంగ్ రేప్ లు, శిరోముండనాలు, దాడులు, దౌర్జన్యాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు.
 
మాచర్లలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ కిషోర్ పై పట్టపగలు నడిరోడ్డుపై హత్యాయత్నం చేశారు. గురజాలలో ఎస్సీ యువకుడు విక్రమ్ ను హత్య చేశారు. 18ఏళ్ల వడ్డెర యువకుడిని చంపేశారు. నకరికల్లులో గిరిజన మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపేశారు.

ఆత్మకూరులో 127కుటుంబాలను గ్రామ బహిష్కారం చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో వైసిపి దుర్మార్గాలు అన్నీఇన్నీ కావు. పల్నాడులో బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకే భద్రత లేకుండా పోయింది. వైసిపి నాయకుల కిరాతకాలకు అంతే లేదు. బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలను బతకనిచ్చే పరిస్థితి లేదు.

హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, ఇళ్లు కూల్చివేయడం, భూములు లాక్కోవడం, గ్రామాల నుంచి తరిమేయడం..  వైసిపి బాధితుల పునరావాస శిబిరం నడపడం దేశంలో ఇదే తొలిసారి. భూకంప బాధితులకు, తుపాన్ బాధితులకు పునరావాస శిబిరాలు నడుపుతారు, గుంటూరులో వైసిపి బాధిత శిబిరం నడపాల్సిన దుస్థితిని కల్పించారు.

‘‘ఛలో ఆత్మకూరు’’కు పిలుపిస్తే నా ఇంటి గేట్లకు పసుపు తాళ్లు కట్టారు. ఆ పసుపుతాళ్లే వైసిపికి ఉరితాళ్లు అవుతాయని అప్పుడే హెచ్చరించాను. మొదట టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు చేశారు. తర్వాత బిసిలను టార్గెట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు.ఆ తర్వాత దళితులపై దౌర్జన్యాలకు తెగించారు. గిరిజనులు, ముస్లింలపై దౌర్జన్యాలు చేశారు. అన్నివర్గాల ప్రజలపై దుర్మార్గాలు చేస్తున్నారు.
 
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడుపై ఎస్సీఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారు. డాక్టర్ అరవింద్ బాబుపై 76తప్పుడు కేసులు పెట్టారు. డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ అనితారాణి పట్ల అమానుషాలు చేశారు. డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ గంగాధర్ ను వేధింపులకు గురిచేస్తున్నారు. వైద్యులను ఇంతగా వేధిస్తోన్న ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. 
 
నరసరావుపేట పార్లమెంటు పరిధిలో  వైసిపి ఎమ్మెల్యేల దోపిడికి అవధులు లేకుండా పోయాయి. శాండ్- ల్యాండ్ మాఫియా, మైన్ -వైన్ మాఫియా అడ్డాగా నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని వైసిపి ఎమ్మెల్యేలు మార్చారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలలో ఇసుక, మద్యం, గనులు, భూములు యధేచ్చగా దోచేస్తున్నారు.  నియోజకవర్గాలలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధిస్తున్నారు. హవుసింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. 

గోదావరి-పెన్నా నదుల అనుసందానానికి పేరుమార్చి, రూ1,600కోట్ల బడ్జెట్ పెంచి భారీ దోపిడికి రంగం సిద్దం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చివుంటే హరిశ్చంద్రపురం ఎత్తిపోతల పథకం ఇప్పటికే పూర్తి చేసేవాళ్లం. గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడికాలువకు మళ్లించేవాళ్లం.

బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లాలన్న టిడిపి ప్రయత్నాలను 16నెలలుగా నిలిపేశారు. టిడిపి చేపట్టిన ప్రాజెక్టులకు, పథకాలకు పేర్లు మార్చి దోచుకుంటున్నారు. నరసరావుపేటలో 300పడకల ఆసుపత్రిని టిడిపి అభివృద్ది చేస్తే, దానిని నిర్వీర్యం చేశారు, నరసరావు పేట ప్రజానీకాన్ని కరోనాకు బలి చేశారు.

100రోజులు ‘‘పసుపు చైతన్యం’’ అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలి. వైసిపి అవినీతిని అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలి. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని’’ చంద్రబాబు పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి నామ‌ సంవత్సరంగా 2020-21: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి