వైసీపీ నేతలపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు తప్పుచేయాలంటే అధికారులు భయపడేవారని, ఎన్నికల కోడ్‌ను ఇష్టానుసారం ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
కుల, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, కావాలనే టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ అభ్యర్థి వద్ద పత్రాలు లాక్కెళ్తున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని చంద్రబాబు ఆరోపించారు. 180 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, టీడీపీ అభ్యర్థుల్ని పోలీసులు కూడా వేధించారని చంద్రబాబు అన్నారు.
నామినేషన్ల గడువు పెంచండి.. ఈసీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. సకాలంలో నో డ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.
సిబ్బంది సకాలంలో నో డ్యూస్, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆరోపించారు. అధికారులు అందుబాటులోలేని కారణంగా అందజేయలేకపోయామనే కారణాలు చెప్పారన్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ నామినేషన్లు దాఖలును అడ్డుకోగా.. ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలకు అనేకమంది సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఘటనలు చోటుచేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆయా ఆధారాలను తన ఫిర్యాదు లేఖకు జత చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం సహా... భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకొనేలా పోలీసులను ఆదేశించాలన్నారు.
పులివెందుల, మాచర్ల, పుంగనూరు, మంత్రాలయం, తెల్లకూరు, కావేటినగర్, పుల్లంపేట స్థానాల్లో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.