Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీది దుర్మార్గపు ప్రభుత్వం: చంద్రబాబు

వైసీపీది దుర్మార్గపు ప్రభుత్వం: చంద్రబాబు
, బుధవారం, 7 అక్టోబరు 2020 (06:59 IST)
వైసీపీది దుర్మార్గపు ప్రభుత్వమని, కార్యకర్తలు అప్రమత్తతతో దానిని ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 175నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులు, సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

1) ‘‘కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం, చైతన్యపర్చడం, బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపి ఫైట్స్ కరోనా’’ వెబ్ సైట్ ప్రారంభించాం. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే దీని లక్ష్యం. 

డాక్టర్లు, సైకాలజిస్ట్ లు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో, కరోనా నుంచి కోలుకున్నవారితో వెబినార్లు నిర్వహించాం. ప్రజల్లో మనోధైర్యం పెంచే కృషి చేశాం. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా విపత్తుల్లో బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రజల పక్షం తెలుగుదేశం..
 
2)దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనం-రూ 30వేలు అప్పు చెల్లించలేదని బిసి యువకుడికి శిరోముండనం చేయడం దారుణం. 3నెలల్లో 3జిల్లాలలో ముగ్గురికి శిరోముండనం వైసిపి అరాచకాలకు పరాకాష్ట.

తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్, విశాఖలో శ్రీకాంత్, జంగారెడ్డి గూడెంలో అభిలాష్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దళితులపై ఈ దమనకాండ జరుగుతోందా..? శిరోముండనం బాధితులు మొదటి ఇద్దరు దళితులు కాగా మూడో వ్యక్తి బిసి కావడం వైసిపి పాలనలో బడుగు బలహీన వర్గాలపై దమనకాండకు అద్దం పడుతున్నాయి. 
 
3) రాజమండ్రిలో ముస్లిం మైనారిటీ షేక్ సత్తార్ ఆత్మహత్యా యత్నం బాధాకరం. ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయం ఎదుటే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం సభ్య సమాజానికే తలవంపులు. పదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వైసిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా, సత్తార్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడం దారుణం. స్నానం చేసే ఆడబిడ్డలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం కన్నా నీచం మరొకటి లేదు. అటు వైసిపి, ఇటు పోలీసుల వేధింపులతో, మానసిక హింసను తట్టుకోలేకే సత్తార్ ఆత్మహత్యా యత్నం చేశాడు.  

సత్తార్ ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో సరైన చర్యలు తీసుకుంటే పురుగుమందు తాగేవాడా..? సత్తార్ ఆత్మహత్యా యత్నానికి కారణం వైసిపి వేధింపులు కాదా..? పోలీసుల వైఖరి కారణం కాదా..?  ‘‘మేము చాలా పేదవాళ్లం, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు మానసిక హత్య. ఐ లవ్ మై ఫ్యామిలీ. నా భార్య పిల్లలను కాపాడి నా కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రార్ధిస్తున్నానంటూ’’  సత్తార్ పేర్కొనడం ఆ కుటుంబం ఆవేదనకు నిదర్శనం. 
 
4)వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చేశారు, విజయవాడలో పట్టాభి కారు ధ్వంసం చేశారు. గురజాలలో టిడిపి నాయకుడు శ్రీనివాసరావు మూడున్నర ఎకరాల బొప్పాయి తోట ధ్వంసం చేశారు. బనగాన పల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డిని తీవ్రంగా వేధిస్తున్నారు..టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 
 
18ఏళ్ల క్రితం అంశంపై కడప జిల్లా టిడిపి నాయకుడు హరిప్రసాద్ అరెస్ట్ చేయడం హేయం. మాజీ మంత్రి జవహర్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపే.. రోడ్లపై డ్యాన్స్ లు వేసిన వైసిపి ఎమ్మెల్యేలపై, ఊరేగింపులు చేసిన వాళ్లపై ఎటువంటి కేసులు లేవు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. 

వ్యాపారుల దుకాణాలను కొట్టేస్తే వారికి పరిహారం ఇవ్వాలని, చిరువ్యాపారుల తరఫున మాట్లాడిన జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. 

5)గత వారం ప్రజాందోళనలు, పార్టీ కార్యక్రమాలు బాగా జరిగాయి. జీవో నెం 3 ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ గిరిజనుల బంద్ కు టిడిపి  నుంచి సంఘీభావం తెలిపాం. దీనిపై ముందే లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం. అయినా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.  గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటాం. ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. 

‘‘ఛలో మదనపల్లి’’ కార్యక్రమం ద్వారా దళితులపై వైసిపి దమనకాండను ప్రజా సంఘాలన్నీ ఎండగట్టాయి.  రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ నిరసించాయి. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు దుర్భాషలను ప్రజల్లో ఎండగట్టాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ ముట్టడి జరిపారు. 
 
ఒకాయన బూతుల మంత్రి, మరొకాయన హవాలా మంత్రి, ఇంకొకాయన బెంజ్ మినిష్టర్, ...ఇక ముఖ్యమంత్రి కథ చెప్పక్కర్లేదు. ఇదీ ఇప్పటి పాలకుల నైజం.  చాలా ప్రభుత్వాలు చూశాం, చాలా పార్టీలను చూశాం. కానీ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పార్టీని చూడలేదు. మనం చేస్తోంది దుర్మార్గులతో పోరాటం.. వైసిపిపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తత అవసరం, మనోధైర్యం ముఖ్యం. 
 
6) రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ఒకవైపు న్యాయస్థానాలు ఆగ్రహించాయి. మరోవైపు ఎన్ సిఆర్ బి నివేదిక చెప్పింది, ఇంకోవైపు ప్రతిపక్షాలన్నీ నిరసిస్తున్నాయి. అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈవిధమైన పరిస్థితులు ఎన్నడూ లేదు. ఇది మన సమాజానికి  మంచిది కాదు, ఇకనైనా మార్పు రావాలి. తప్పు చేసినవాళ్లు ఎవరైనా పార్టీలకతీతంగా  కఠినంగా శిక్షించాలి.

7)రాష్ట్రంలో  దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ధ్వంసం. ఈ రోజు ఆదోనిలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. నరసరావుపేట శృంగేరీ శంకర మఠం వద్ద సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 
 
పుట్టపర్తిలో ఎయిర్ పోర్ట్ వద్ద లలితాదేవి దేవాలయంలో దొంగలు పడ్డారు. 10 తులాల బంగారం, 5కిలోల వెండికిరీటం, హుండీని చోరీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మనుషులకే కాదు, దేవతలకు కూడా రక్షణ లేకుండా పోయింది.
రాష్ట్రంలో ఆలయాల పట్ల అపచారాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఆగకపోవడం వైసిపి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట..
8)భారీ వర్షాలు, వరదలకు 3లక్షల 20వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండేళ్లలో రెండుమూడు సార్లు వరదలు.. రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు, దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు లేవు. మత్స్యకారులు, చేనేతలు, చేతివృత్తుల వారికి రూపాయి పరిహారం ఇవ్వలేదు. 

రోడ్లన్నీ గుంతలు పడ్డాయి, నెలరోజులైనా తట్ట మట్టి పోసిన వాళ్లు లేరు. దెబ్బతిన్నరోడ్లను బాగుచేసే పరిస్థితి లేదు. ప్రజలు నరకం చూస్తున్నా వైసిపి ప్రభుత్వంలో స్పందన లేదు. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ బిల్లుల అధ్యయనం చేయాలి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) ఉండాలి, వ్యవసాయ మార్కెట్ యార్డులను కొనసాగించాలి, రైతులకు మరిన్ని వసతులు కల్పించాలి. ప్రస్తుతం ఉన్న ప్రయోజనాలను కొనసాగిస్తూనే మరింత లబ్ది రైతులకు చేకూర్చాలి అనేది టిడిపి వాదన..దానినే మన ఎంపిలు పార్లమెంటులో వినిపించారు.
 
వైసిపి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం, క్షేత్రస్థాయిలో రైతులకు జరిగే అన్యాయాలను అడ్డుకోవాలి, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తెచ్చి పరిష్కారం అయ్యేలా చూడాలి.

9)కరోనాతో ప్రజలు సతమతం అవుతుంటే వైసిపి నాయకులు మాత్రం అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో రూ 4వేల కోట్ల కుంభకోణం చేశారు, లెవలింగ్ పేరుతో రూ 2వేల కోట్ల నరేగా నిధులు స్వాహా చేశారు. ప్రతి నియోజకవర్గంలో వైసిపి స్కామ్ లను బట్టబయలు చేయాలి. బెంజ్ మినిస్టర్ జయరామ్ భూముల కబ్జాపై సాక్ష్యాధారాలతో అయ్యన్నపాత్రుడు రుజువు చేశారు. అదేవిధంగా ప్రతి మంత్రి, వైసిపి ఎమ్మెల్యేల అవినీతిని డాక్యుమెంట్ ఎవిడెన్స్ లతో సహా ప్రజల్లో ఎండగట్టాలని’’ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టిడిపి నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో వరం