ప్రభుత్వ సొమ్ము బ్యాంకు కరెంట్ ఖాతాల్లో వుందా? వడ్డీ ఇంకేమొస్తుంది? యనమల
అమరావతి: నగదు లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో ఉన్న ప్రభుత్వ నిధులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో సమీక్షించారు. ప్రభు
అమరావతి: నగదు లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో ఉన్న ప్రభుత్వ నిధులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ లో సమీక్షించారు. ప్రభుత్వంపై వడ్డీ భారం పడకుండా నూతన పద్దతులు అవలంభించడంపై చర్చించారు. వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధుల వివరాలను సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ)లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సంక్షేమ పథకాలకు కేటాయించి, లబ్దిదారులకు చేరని నిధుల వివరాలు కూడా అందులో నమోదు చేయాలని చెప్పారు. ప్రభుత్వానికి వివిధ మార్గాలలో రావలసిన ఆదాయం రాబట్టడానికి తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయం పెంచాలని మంత్రి యనమల ఆదేశించారు.
ట్రెజరీలలో కాకుండా బయట బ్యాంకులలో ఉన్న ప్రభుత్వ నిధుల వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. ఆ నిధులను నాలుగు ఖాతాలగా డిపాజిట్ చేస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేసే పథకాల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల వంటి సంస్థల సొంత నిధులు, బహుళ ప్రయోజనం కోసం డిపాజిట్ చేసిన నిధులు మొత్తం రూ.12,568 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవి ఫిక్సిడ్ డిపాజిట్, కరెంట్, సేవింగ్స్ అకౌంట్ ఖాతాలలో ఉన్నట్లు తెలిపారు. కరెంట్ అకౌంట్ ఖాతాలలో ఉంటే వడ్డీ ఏమీ రాదని, ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 7 శాతం, సేవింగ్స్ ఖాతాలకు 3 శాతం వడ్డీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
మొత్తం రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు అంతే ఫిజికల్ డెఫిసిట్ ఉందని, అంత డబ్బుని బ్యాంకుల వద్ద అప్పు తీసుకుంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుందని వివరించారు. ఆ నిధులను పీడీ ఖాతాలకు తరలిస్తే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ ఖాతాలో డబ్బు ఉంటే కేటాయించిన అవసరాలతోపాటు ఇతర ఏ అవసరాలకైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పీడి ఖాతాలలో ఉంటే పీఎఫ్, కోర్టు డిపాజిట్ వంటి వాటికి మాత్రమే వడ్డీ చెల్లిస్తామని, మిగిన సొమ్ముకు ఎటువంటి వడ్డీ చెల్లించవలసిన అవసరంలేదని వివరించారు. ఆ విధంగా ప్రభుత్వానికి వడ్డీ భారం తగ్గుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్, స్పెషల్ ప్యాకేజీ, ఆర్థిక వృద్ధిరేటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కార్యదర్శి పియూష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.