అనంతపురం నుంచే ప్రపంచ స్థాయి వాహనాలు: కియా ఎండీ

శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:34 IST)
కియా కార్ల పరిశ్రమను తమిళనాడు తరలిస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆ వార్తల్లో నిజం లేదని కంపెనీ ఎండీ స్పష్టం చేశారు. అనంతపురంలోనే తమ పరిశ్రమను కొనసాగిస్తామని తెలిపారు. అనంతపురం ఫ్యాక్టరీ నుంచే ప్రపంచ స్థాయి వాహనాలు తయారు చేస్తామని తెలిపారు.

గత కొద్ది రోజులుగా కియా కార్ల పరిశ్రమ అనంతపురం నుంచి తరలిస్తారనే ప్రచారం సాగింది. దీంతో విపక్షాలు, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంతకుముందు కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లదని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఏపీ నుంచి వెళ్తుందన్న దుష్ప్రచారంపై కియా కంపెనీ లీగల్‌ యాక్షన్‌ ఆప్షన్‌ను పరిశీలిస్తుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కంపెనీ కూడా పోదని, ఆ పరిస్థితి రానివ్వమని తెలిపారు. అన్ని పరిశ్రమలకూ ఒకేరకమైన రాయితీలు ఇవ్వకూడదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

పరిశ్రమ స్థాయి, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
 
కియా ప్లాంట్.. గురువారం ఉదయం నుంచి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ‘కియ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోతోంది.. తమిళనాడు ప్రభుత్వ అధికారులతో కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతోంది’ అంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రచురించిన కథనంతో ఏపీలో కలకలం మొదలైంది.

రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా.. ఉన్న కంపెనీలు కూడా పోతున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తుండగా.. అవన్నీ పుకార్లేనని వైసీపీ ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. అటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వార్తా కథనాలపై స్పందించింది.

కియా ప్లాంట్ తరలింపు గురించి సమాచారం తమకు ఇంతవరకు లేదనీ.. అలాంటి సంప్రదింపులు కూడా ఏమీ జరగలేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చిచెప్పింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్