Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతి త్వరలో రైతు భరోసా కేంద్రాలను సందర్శిస్తా: రసాయన రహిత సాగును గుర్తుచేసుకున్న గవర్నర్

అతి త్వరలో రైతు భరోసా కేంద్రాలను సందర్శిస్తా: రసాయన రహిత సాగును గుర్తుచేసుకున్న గవర్నర్
, గురువారం, 17 మార్చి 2022 (22:36 IST)
రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏక గవాక్ష విధానంలో రైతులకు అవసరమైన అన్ని సేవలను వారి చెంతనే అందించగలగటం సాధారణ విషయం కాదని అభినందించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, విధి విధానాలు, రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్‌కు నివేదిక సమర్పించారు.

 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను అందించాలని అకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో రసాయన రహిత వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున చేపట్టటం రైతుల ఆసక్తిని వెల్లడి చేస్తుందని, తాను గతంలో ఆయా వ్యవసాయ క్షేత్రాలను సైతం సందర్శించానని గుర్తు చేసుకున్నారు. మధ్యవర్తుల పాత్ర లేకుండా రైతుల నుండి చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయటం వారికి భరోసానిస్తుందన్నారు.

 
ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ, వ్యవసాయదారుల వాస్తవ అవసరాలను గుర్తెరిగిన ప్రభుత్వం ఆర్‌బికెలను స్థాపించి అన్ని రకాల సేవలను వారికి చేరువ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏర్పాటు తదుపరి దేశంలోని ఐదారు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేసి వెళ్లారన్నారు. సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విన్నవించగా, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాను ఆదేశించారు.

 
వ్యవసాయ శాఖ కమీషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్‌బికె కోసం ప్రభుత్వం పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించిందని, ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక ఆర్‌బికె సేవలు అందిస్తుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం గ్రామం దాటి వెళ్లవలసిన అవసరం లేకుండా ఈ కేంద్రాలు విశేష రీతిన సేవలు అందిస్తున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నా, మనకు మంత్రి పదవి ఇస్తారా? తిరుపతి ఎమ్మెల్యే దగ్గర నేతలు..