టిక్ టాక్ వల్ల ఎంజాయ్మెంట్ సంగతి ఏమిటోగానీ దీనివల్ల కొన్ని కాపురాలు మాత్రం కూలిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో టిక్ టాక్ మోజులో పడి భర్తను వదిలేసింది భార్య.
రోజురోజుకి వేలంవెర్రిగా మారుతున్న టిక్ టాక్ మోజు పలు అనర్థాలకు దారితీస్తోంది. దీనివల్ల కొన్ని కాపురాలు కూడా బుగ్గిపాలు అవుతున్నాయి. తమిళనాడులో కొత్తగా పెళ్ళయిన జంట మధ్య టిక్ టాక్ చిచ్చుపెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి సమీపంలోని దేవరకోట గ్రామానికి చెందిన ఆరోగ్య లోయ అనే వ్యక్తికి లలిత అనే అమ్మాయితో ఒకనెల క్రితం వివాహమైంది.
ఉద్యోగరీత్యా పెళ్ళయిన తరువాత సింగపూర్ వెళ్ళాడు భర్త. అయితే ఇంట్లో ఒక్కటే ఉండడంతో కాలక్షేపంగా టిక్ టాక్ ను ప్రారంభించిన లలిత క్రమంగా దానికి బానిసగా మారిపోయింది. రోజంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో తన వీడియోలకు కామెంట్లు పెట్టే అభి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది.
తరచూ అతనితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. సింగపూర్ నుంచి ఇంటికి వచ్చిన భర్త టిక్ టాక్ మానమని భార్య లలితను మందలించాడు. దీంతో భర్త మీద కోపం పెంచుకున్న లలిత ఇంట్లోని 60 సవర్ల బంగారం, నగదుతో ప్రియుడితో కలిసి పరారైంది. ఎంత వెతికినా భార్య జాడ తెలియకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.