దాడి జరిగి రోజులు గడుస్తున్నాయి. అయినా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు. చంద్రబాబుతో సహా టిడిపి నేతలంతా దాడిని డ్రామాగా చెబుతుంటే జగన్ ఎందుకు మాట్లాడడం లేదు. ఆయన మనస్సులో ఏముంది. దీని గురించి ఎప్పుడు మాట్లాడుతారు.
గత వారంరోజుల క్రితం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్ పైన దాడి జరిగింది. సేఫ్‌గానే ఉన్నానంటూ జగన్ ట్వీట్. హైదరాబాద్‌లో చికిత్స. జగన్ పైన దాడి జరిగిన తరువాత నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య కోడి కత్తి రాజకీయం నడుస్తోంది. మాటలు కోటలు దాటి రెండు పార్టీలు తీవ్రస్థాయిలో విమర్సించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వైసిపిపై పూర్తిస్థాయిలో దాడి మొదలు పెట్టారు. ఇంత జరిగినా జగన్ మాత్రం దాడిపై నోరు మెదపలేదు.
ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్ ఇచ్చి కొన్నిరోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో జగన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికే పరిమితమయ్యారు. ఎయిర్ పోర్ట్‌లో దాడి వెనుక అధికారపార్టీ కుట్ర ఉందని, జగన్‌తో సహా వైసిపి నేతలు గట్టిగా భావిస్తున్నారు. అయితే జగన్ నేరుగా ఇప్పటివరకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. శనివారం నుంచి తిరిగి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుండటంతో జగన్ దీనిపై మాట్లాడే అవకాశం ఉందని వైసిపి నేతలు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే పాదయాత్ర బహిరంగ సభలో జగన్ మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.