తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలబద్రపురం గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం, జగన్ కలసి కుట్రలో భాగంగానే కోడికత్తి కేసును ఎన్.ఐ.ఏకి అప్పగించారు. ఎన్.ఐ.ఏ ఏక్ట్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీ కేసు, రాష్ట్రాలలో లా అండ్ ఆర్డర్ సమస్యల కేసులను మాత్రమే ఎన్.ఐ.ఏకు అప్పగిస్తారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఎన్.ఐ.ఏకి కేసును అప్పగించింది.
ఎన్.ఐ.ఏ యాక్టులో లేకపోయినా కోడికత్తి కేసును ఎన్.ఐ.ఏ అప్పగించడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలని మోడీ ప్రభుత్వం జగన్‌ను అడ్డంపెట్టుకొంది అన్నారు. జగన్ పైన 11 ఛార్జ్ షీట్లు ఉన్నా 3 ఛార్జ్ షీట్లు పైన ట్రైయిల్ రన్ మొదలైనాయి. మిగతా ఛార్జ్ షీట్లు ఎప్పుడు మొదలవుతాయి. రాజకీయ నాయకులు, ఆర్థిక నేరగాళ్లు పైన ఎటువంటి కేసులు ఉన్నా సంవత్సరంలోపు కేసులు పరిష్కరించాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉన్నా.. కేంద్రప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
సీబీఐ కోర్టు న్యాయమూర్తిని మార్చడం ద్వారా జగన్ కేసులు మొదటికి వచ్చి మరింత ఆలస్యం జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన రూ.43 వేల కోట్లు ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది. ఆయనకి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. లోటస్ పాండ్‌లో బంగ్లా, ఇడుపులపాయలో బిల్డింగ్, బెంగుళూరులో 60 గదుల ప్యాలస్ జగన్‌కు ఎలా వచ్చాయి? ప్రజల డబ్బును దోచుకున్నవాడు చట్టం నుండి తప్పించుకోలేరు. మోడీ కాపాడాలని ప్రయత్నంచినా ప్రజల డబ్బు దోచుకున్న వారికి శిక్ష పడటం ఖాయం. జగన్ దోచుకున్న డబ్బు వెనక్కి వస్తుంది. ఆ డబ్బును ప్రజలకు పంచిపెట్టడం తధ్యం అన్నారు.