హోదా ర్యాలీ వైఫల్యానికి కారణం పవనా.. జగనా?
ఆంద్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతుందని భావించిన ప్రత్యేక హౌదా మౌనదీక్షలు, శాంతియుత ర్యాలీలు అంతిమంగా ఊహంచినంత స్పందన తేలేకపోవడానికి కారణం ఏమిటి? పోలీసుల అత్యుత్సాహం, చంద్రబాబు కఠిన వైఖరి మాత్రమే ఈ కార్యక్రమం విఫలం కావడానికి దారితీశాయా. సోషల్ మీడి
ఆంద్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతుందని భావించిన ప్రత్యేక హౌదా మౌనదీక్షలు, శాంతియుత ర్యాలీలు అంతిమంగా ఊహంచినంత స్పందన తేలేకపోవడానికి కారణం ఏమిటి? పోలీసుల అత్యుత్సాహం, చంద్రబాబు కఠిన వైఖరి మాత్రమే ఈ కార్యక్రమం విఫలం కావడానికి దారితీశాయా. సోషల్ మీడియాలో రెండు మూడురోజులుగా తుఫాను సృష్టించిన హోదా ర్యాలీ అసలు రోజున నిర్బంధానికి అంత ప్రతిఘటన ఇచ్చిన తర్వాత కూడా చప్పబడిపోవడానికి కారణం ఏమిటి?
జనవరి 26న విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో అటు వైకాపా, ఇటు జనసేన, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు చేపట్టాలనుకున్న ప్రత్యేక హోదా మౌన దీక్షలు ఇంతకూ సక్సెస్సా లేక ఫెయిల్యూరా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువలా తలెత్తుతున్నాయి. చెన్నయ్ మెరీనా బీచ్‌లో జల్లికట్టు స్ఫూర్తితో చెలరేగిన ప్రత్యేక హోదా ర్యాలీ జల్లికట్టు దీక్ష సాధించిన విజయంతో పోలిస్తే పూర్తిగా వైఫల్యం చెందినట్లే కనిపిస్తోందని పరిశీలకుల ఉవాచ.
జల్లికట్టు దీక్షలు దేశవ్యాప్తంగా ఆసక్తి గొల్పించి ఘన విజయం సాధించినప్పుడు అయిదు కోట్ల మంది ప్రజల సజీవ ఆకాంక్షగా ముందుకొచ్చిన ప్రత్యేక హోదా ర్యాలీ ఎందుకు సక్సెస్ కాదని జనవరి 26 ఉదయం వరకు అందరూ భావించారు. కానీ పోలీసులు ఉక్కుపాదం మోపడం వల్లే కావచ్చు. రిపబ్లిక్ డే నాడు ఎలాంటి అవాంఛనీయ పరిణామాలూ చోటుచోసుకోకూడని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కావచ్చు హోదా ర్యాలీ అనుకున్నంత ప్రచారం కానీ, విజయం కానీ పొందలేకపోయిందన్నది వాస్తవమేనని విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకిలా? జవాబు చాలా సింపుల్ అంటున్నారు. విశాఖ ర్యాలీలో ప్రజల భాగస్వామ్యం పూర్తిగా లోపించడమే ర్యాలీ వైఫల్యానికి కారణం. మెరీనా బీచ్ దీక్షకు, ఆర్కే బీచ్ ర్యాలీలకు మధ్య తేడా ఇదేనట. సోషల్ మీడియాలో వైజాగ్ ర్యాలీ గురించి ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి ప్రదర్శించినప్పటికీ ర్యాలీలో పాల్గొనే విషయం వచ్చేసరికి వారిలో చాలామంది పాల్గొనలేదన్నది వాస్తవం. రాజకీయ నేతగా మారిన హీరో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో కాటమరాయుడు షూటింగ్ కొనసాగించుకుంటూ ట్వీట్లకు మాత్రమే పరిమితం కావడంతో పవన్ అనుచరులు దాదాపుగా విశాఖ ర్యాలీకి ముఖం చాటేశారని తెలుస్తోంది.
టాలీవుడ్ హీరోలు రామ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు విశాఖ ర్యాలీలో పాల్గొంటామని చెప్పి కూడా హాజరు కాకపోవడం విశేషం. తెలంగాణకు చెందిన సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ మాత్రమే విశాఖ వచ్చి అరెస్టయ్యారు తప్పితి తక్కిన కుర్రహీరోలెవరూ ఆ దరిదాపుల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు కాస్తయినా నెలకొన్నాయంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనటమే కారణం. ర్యాలీ సక్సెస్ కావడానికి వారు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ సామాన్య ప్రజలు అనుకున్నంతగా ఆసక్తి చూపకపోవడంతో వైకాపా కార్యకర్తలు కూడా సాధించిందేమీ లేకుండా పోయింది.
విశాఖ నగరం మొత్తంలో వీధుల్లోకి వచ్చిన వైకాపా కార్యకర్తలను అరెస్టు చేయడంలో పోలీసులు విజయవంతం అయ్యారు. కానీ విమానాశ్రయంలో పోలీసుల దిగ్బంధనం నుంచి బయటపడి వైకాపా అధినేత జగన్ నగరంలోకి వచ్చి ఉంటే పరిస్థితి కాస్త పుంజుకునేది కానీ విమానాశ్రయం దాటి జగన్ ముందుకు వెళ్లలేకపోయారు. ప్రజల భావోద్వేగాలను సమస్య ప్రేరేపించపోతే వారు వీదుల్లోకి రావడం కష్టమేనని తేలిపోయింది. ప్రతిపక్షాలు ఎంత కష్టపడినా చివరికి ఇదే నిరూపితమైంది.
ప్రజల్లో బావోద్వోగాలు మరింత తీవ్రంగా ఉన్నట్లయితే చంద్రబాబు వేలాదిమంది పోలీసులను మోహరించి ఉన్నప్పటికీ విశాఖ ర్యాలీకి జనం పోటెత్తి ఉండేవారని విశ్లేషకుల ఉవాచ. దానికి తోడు రిపబ్లిక్ డే నాడు ర్యాలీ పెట్టుకోవడంతో ప్రభుత్వం శాంతి భద్రతల కోణాన్ని చూపి అణచివేతకు సహజంగానే చట్టబద్ధత కల్పించుకుంది. టైమింగ్ కూడా విశాఖ ర్యాలీకి కలిసిరాలేదనే చెప్పాలి.
భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు హోదాపై చేపట్టే కార్యక్రమాలకు ఇది ఒక గుణపాఠం కావాలి.