Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే విశాఖకు షిఫ్ట్... రాజధాని తరలింపునకు కారణాలు చెప్పిన సీఎం జగన్

అందుకే విశాఖకు షిఫ్ట్... రాజధాని తరలింపునకు కారణాలు చెప్పిన సీఎం జగన్
, శనివారం, 28 డిశెంబరు 2019 (12:11 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించడానికి గల కారణాలను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన సహచరులకు వెల్లడించారు. ఏ ఒక్కరిపైనో ఉన్న కోపం, కక్షతో రాజధానిని మార్చడం లేదనీ, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలన్న కాంక్షతో మార్చుతున్నట్టు శుక్రవారం తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ సహచరులకు చెప్పారు.
 
ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రెండు కోట్లు ఖర్చవుతాయని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు. అంటే 53 వేల ఎకరాలకు రూ.లక్షా ఆరు వేల కోట్లు ఖర్చు చేయాల్సివుంటుంది. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.5,800 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు చెప్పినట్లుగా రాజధానిని అభివృద్ధి చేయాలంటే రూ.1,10,000 కోట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంత డబ్బును ఖర్చు చేయగలదా? అని జగన్ మంత్రులను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలోనే ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున ఖర్చు చేస్తే దశాబ్దాలు గడచినా అభివృద్ధి చేయలేం.
 
పైగా, ప్రతి ఐదేళ్లకోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. కట్టిన భవనాలన్నీ కుంగిపోతుంటాయన్నారు. అమరావతిలో రోడ్లు నిర్మించాలంటే.. రూ.42 కోట్ల వ్యయమవుతుందని... ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. అదే విశాఖలో రాజధానిని నిర్మించి ఉంటే.. పరిస్థితి ఈరోజు మరోలా ఉండేది. అక్కడ సచివాలయం, అసెంబ్లీ నిర్మించి.. మెట్రో రైలును ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేవాళ్లం. రూ.10 వేల కోట్లు ఖర్చుచేస్తే విశాఖ మహానగరంగా ప్రపంచంతోనే పోటీ పడుతుంది అని వివరించారు. అమరావతి అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు.
 
'జలయజ్ఞం కింద రూ.23 వేల కోట్లు వ్యయం చేయాలి. గోదావరి జలాలను బానకచర్ల ద్వారా రాయలసీమకు తీసుకెళ్లాలి. దీనికి రూ.65 వేల కోట్లు కావాలి. వాటర్‌ గ్రిడ్‌ కింద ఉపరితల జలాలను ప్రతి ఇంటికీ అందజేయాలి. రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చవుతాయి. ఇంకోవైపు నవరత్నాల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బందరు పోర్టును అభివృద్ధి చేయాలి. అప్పుడే కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన ప్రాధాన్యం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి. అందుకే రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్నాం' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్ణయం తీసుకున్నా.. జనవరి 20న ఆమోదముద్రవేద్దాం : మంత్రులతో జగన్!!