Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే బోర్డు సభ్యుడిగా నాలుగోసారి అవకాశం.. ఎవరీ కృష్ణమూర్తి?

krishnamurthy vaidyanathan ttd
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (09:37 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా ఉంటూ శ్రీవారికి సేవ చేసే భాగ్యం అంత ఆషా మాషీగా లభించదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా వరుసగా నాలుగోసారి తితిదే బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయనకు వరుసగా తితిదే బోర్డు సభ్యత్వం ఇవ్వడానికి కారణం ఏంటి? ఆయన తరపున సిఫార్సు చేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి తితిదే బోర్డు సభ్యత్వానికి ఎక్కడలేని డిమాండ్ ఉంది. జీవితకాలంలో ఒక్కసారీ సంపాదించలేని తలపండిన నాయకులూ ఉన్నారు. ఈ సభ్యత్వం కోసం అవసరమైతే ప్రధాని కార్యాలయం నుంచీ సిఫార్సులు చేయిస్తారు. స్వామిసేవను అటుంచి, ఈ పదవిని చాలామంది పరపతికే వినియోగిస్తారు. తమకుండే ప్రొటోకాల్‌ను వినియోగించుకుని కార్పొరేట్‌ దిగ్గజాలకు దగ్గరవుతున్నారు. 
 
ఇలా పెంచుకునే పరపతితో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. అందుకే తితిదే బోర్డులో పదవికి డిమాండు పెరిగింది. 'మంత్రివర్గ కూర్పునే సులభంగా చేయగలిగా.. తితిదే బోర్డు నియామకం మాత్రం అంత ఈజీగా చేయలేకపోయా' అని సీఎం జగన్‌ ఓ సందర్భంలో అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
ఇంతటి డిమాండ్‌ ఉన్న తితిదే బోర్డు సభ్యత్వం.. కృష్ణమూర్తి వైద్యనాథన్‌కి మాత్రం వరుసగా అవకాశం వస్తూనే వుంది. చెన్నైకి చెందిన ఈ ఆడిటర్‌ 2015 ఏప్రిల్‌లో 27న తొలిసారి తెలుగుదేశం పార్టీ హయాంలో తితిదే బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. తర్వాత 2018లో స్థానం దక్కలేదు. వైకాపా అధికారంలోకొచ్చిన ఏడాదే 2019 సెప్టెంబరులో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. 
 
అప్పటినుంచి ఇప్పటివరకూ వరుసగా అవకాశం వస్తోంది. 2021 బోర్డులో ఆయనకు అవకాశం రాలేదు. కొద్దిరోజులకే బోర్డులోని వేమిరెడ్డి ప్రశాంతిని ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా నియమించి ఆమె స్థానంలో సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. మొత్తమ్మీద 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో ఆరేళ్లు ఆయన తితిదే బోర్డు సభ్యుడిగా కొనసాగగలిగారు. 
 
ఇప్పుడూ అవకాశం దక్కింది. తొలిసారి కేంద్రంలోని ఓ కీలక మహిళామంత్రి సిఫార్సుతో వచ్చారనే ప్రచారం ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రధాని తర్వాత స్థానంలో ఉండే కీలకమంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి తితిదేలో అవకాశాన్ని పొందగలుగుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ మహిళా మంత్రి ఎవరో ఇప్పటికే మీకు గుర్తుకువచ్చివుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వ్యాయామాలు చేస్తే మహిళలకు పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయా?