ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ వద్ద వుండగా జనసేన బాగుపడదు... అందుకే భాజపాలో చేరా... ఎవరు?

శనివారం, 17 ఆగస్టు 2019 (17:08 IST)
భారతీయ జనతా పార్టీ వీలు చిక్కినప్పుడల్లా అటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేన పార్టీకి షాకులిస్తోంది. ఆ పార్టీలకు చెందిన నాయకులను మెల్లిగా పార్టీలో చేర్చుకుంటోంది. అలా క్రమంగా ఏపీలో బలం పుంజుకోవాలన్నది భాజపా ప్లాన్. ఇక ఈ ప్లానులో భాగంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం ఆహ్వానం అందించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ కూడా నర్మగర్భంగా స్పందించారు. తన నెత్తిపై కత్తి పెట్టి పార్టీని కలపమన్నా ఆ పని చేసేది లేదని తేల్చి చెప్పారు. 
 
తాజా పవన్ కామెంట్లతో ఇక జనసేన అధినేత ఇటువైపు చూసేది లేదని భాజపా అనుకున్నదో ఏమోగానీ, జనసేనకు చెందిన నాయకులను మెల్లమెల్లగా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన పి. లక్ష్మీసామ్రాజ్యంకి కమలం తీర్థం ఇచ్చేసింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు గత ఎన్నికల్లో 7 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయనీ, ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర అంజిబాబు వంటి వ్యక్తులు వుండగా ఇక ఆ పార్టీ బాగుపడదనిపించి భాజపాలో చేరినట్లు వెల్లడించారు. ఎందుకంటే... జనసేనకు ఓట్లు వేసినవారిని వదిలేసి వైసిపికి ఓట్లు వేసిన వారిని పవన్ వద్దకు తీసుకుని వెళ్లి వారు పార్టీ కోసం శ్రమించారని చెప్పడమూ, వారికి సముచిత గౌరవం లభించడం.. తదితరాలన్నీ చూశాక, ఇక జనసేనలో న్యాయం లభించదన్న నిర్ణయానికి వచ్చి ఈ పని చేసినట్లు సామ్రాజ్యం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇమ్రాన్... ఇప్పటికైనా అర్థం చేసుకో: పాకిస్తాన్‌కి షాకిచ్చిన ట్రంప్