వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను సర్వ నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. సలహాదారులు ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే బుగ్గన అప్పుల వివరాలు తెలపాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసిన ప్రస్థానంతో మొదలు పెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేసారని శైలజానాథ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రతినెలా వస్తున్న రూ.11,000 కోట్ల ఆదాయంలో రూ.1100కోట్లు వివిధ కేంద్ర పథకాల కోసం కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో జమచేసే మొత్తం. వీటిని కచ్చితంగా కేంద్ర పథకాలకే వాడాలనీ, రాష్ట్రంలో అది జరగడంలేదన్నారు.
అవిపోను మిగిలేది రూ.10వేల కోట్ల ఆదాయం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చేశామంటున్న అప్పుల రీపేమెంట్ కోసం ప్రతినెలా రూ.3,500 కోట్లు, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పుల కోసం రూ.1,000 కోట్లు చెల్లిస్తోందని, అంటే మొత్తం రూ.4,500 కోట్లు అప్పుల రీపేమెంట్ కి వెళ్లిపోతుందని చెప్పారు.
రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం ప్రతి నెలా అప్పుల చెల్లింపులకే పోతుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు అంటే, 9 నెలల కాలానికి రూ.20,750 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతించిందని, ఈ మొత్తం పరిమితిని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేశారన్నారు.
ఇది కాకుండా ఏపీఎ్సడీసీ, ఏపీ రోడ్డు అభివృద్ధి సంస్థ, ఆర్థిక సేవల పేరుతో ఏర్పాటు చేసిన ఎన్బీఎ్ఫసీతోపాటు పలు ఇతర కార్పొరేషన్ల ద్వారా వేలకోట్లు అప్పు తెచ్చుకున్నారని, కేంద్రాన్ని బతిమాలి అదనంగా రూ.10,500 కోట్లు అప్పులకు అనుమతి తెచ్చుకుని అందులో రూ.3వేల కోట్లు కేవలం వారంలోనే వాడేస్తున్నారని, 35 రోజుల్లో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి సెప్టెంబరు చివరి వారంలో రూ.3,500 కోట్లు, ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేరుతో ప్రభుత్వంలోని ఇతర శాఖల నుంచి దాదాపు రూ.1,000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల రుణాలను తీసుకున్నారన్నారు.
సెప్టెంబరు 3వ తేదీన కొత్తగా రూ.10,500 కోట్లు అప్పు చేసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చిందని, సెప్టెంబరు 7న మొదలుకొని ప్రతి మంగళవారం రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీలు వేలం వేస్తోందని,సెప్టెంబరులో రూ.5,000 కోట్లు తీసుకురాగా ఈ నెల 5న మొదటి మంగళవారం రూ.2,000 కోట్లు, రెండో మంగళవారమైన 12వ తేదీన మరో రూ.2,000 కోట్లు తెచ్చిందని, కేంద్రం ఇచ్చిన కొత్త అప్పుల అనుమతిలో 35 రోజుల్లో రూ.9,000 కోట్లు తెచ్చేశారని, ఇంకా రూ.10,500 కోట్ల అప్పునకు అనుమతి ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1956 నుంచి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తే రాజకీయం కోసం వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం తగదని అన్నారు.