Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు : ఉదయలక్ష్మి

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు : ఉదయలక్ష్మి
, బుధవారం, 17 మార్చి 2021 (20:26 IST)
కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. 
 
ముందుగా పీఎఫ్ రాష్ట్ర అదనపు కమిషనర్, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సెక్రటరీ కృష్ణచౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరగక ముందు 2013లో హైదరాబాదులో ఈపీఎఫ్ సమావేశం జరిగిందన్నారు. ఎనిమిదేళ్ల తరవాత ప్రాంతీయ సమావేశం జరుగుతోందన్నారు. ప్రావిడెంట్ ఫండ్ వివరాలతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన వివరించారు. 
 
పీఎఫ్ పొందే సమయంలో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలను తెలిపారు. రాష్ఠ్ర విభజన తరవాత విజయవాడకు ఈపీఎఫ్ జోనల్ కార్యాలయం తరలొచ్చిందని, గుంటూరు, కడప, రాజమండ్రి, విశాఖపట్నం నగరాల్లో రీజనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని పీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. కొవిడ్ కాలంలో అత్యవసర విభాగం కింద  కార్యకలాపాలను కొనసాగించామన్నారు. ఈపీఎఫ్ విధానంలో ఉన్న ప్రయోజనాలను అధికారులు కమిటీకి వివరించారు.
 
రాష్ట్ర విభజన తరవాత కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం నిర్వహించడంపై ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి ఆనందం వ్యక్తంచేశారు. కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడంతో వారికి కార్మిక భవిష్యనిధి ప్రయోజనాలు అందజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన భవిష్యనిధి ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. 
 
భవిష్యనిధి రుణాలు, పింఛన్లు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ సంయుక్త కార్యదర్శి కె.ఆదినారాయణ, కార్మికశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ, నాలుగు జోన్ల రీజనల్ కమిషనర్లు కుందన్ అలోక్, టి.ఇందిర, సునీల్‌కుమార్ దేబ్, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ విద్యా విధానం అమలు : సీఎం జగన్