ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఉదయం పెళ్లి జరిగితే రాత్రికి ఆమె ప్రాణాలు తీసుకుంది. అదీ కూడా శోభనం గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, సోమందేపల్లికి చెందిన 22 యేళ్ల హర్షితకు కర్నాటక రాష్ట్రంలోని బాగేపల్లికకి నాగేంద్ర అనే యువకుడితో మంగళవారం ఉదయం వివాహం జరిగింది. కళ్యాణ మండపంలో పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు వియ్యంకుడి ఇంటికి వెళ్లారు. రాత్రికి శోభనం ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ క్రమంలో శోభనం గదిలోకి వెళ్లిన హర్షిత... ఆ గదిలోనే ఉరేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఉదయం మూడు ముళ్లు వేయించుకుని, రాత్రికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అప్పటివరకు పెళ్లికళతో ఉట్టిపడిన ఇల్లు కొన్ని గంటల్లోనే శోకం ఆవహించింది.
వరకట్న వేధింపులు... పెళ్లయిన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య
ఏపీలోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. అత్తింటి వేధింపులు కారణంగా నవ వధువు పెళ్లయిన మూడు నెలలే తనువు చాలించింది. వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ బోరున విలపిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు... మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు, శివనందేశ్వరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఈ యేడాది ఏప్రిల్ 23వ తేదీన కంకిపాడు మండలం కందేరుకు చెందిన అరుణ్ కుమార్‌తో ఆమె వివాహం జరిగింది.
శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండగా, అరుణ్ కుమార్ ఉయ్యూరు మండలం కలవపాములలో సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవిద్య అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
తమ కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరులోని తమ ఇంటిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని తన కుమార్తెను పెళ్లయిన రోజు నుంచే వేధిస్తున్నారని, అప్పటికే కట్నంగా రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం ఇచ్చినట్లు ఆయన వాపోయారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.