గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని, జిఓ నెంబర్ 3 పై న్యాయపరంగానే ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
ఈ విషయంగా గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇదే విషయంగా రాష్ట్ర గిరిజన సలహామండలి సమావేశాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్.3ని ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ విషయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి వివరించారు.
జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంగా వెంటనే స్పందించిందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో న్యాయ విభాగం అధికారులు, గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గిరిజన శాఖ డైరెక్టర్, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఇతర న్యాయ నిపుణులు మూడుసార్లు సమావేశాలను నిర్వహించి ఈ వ్యవహారంలో ముందుకు ఎలా వెళ్లాలనే విషయంగా కార్యాచరణను రూపొందించారని తెలిపారు.
ఈ జీవోను రూపొందించిన అప్పటి అధికారులతో పాటుగా పలువురు న్యాయకోవిదులను తాను కూడా వ్యక్తిగతంగా సంప్రదించి చర్చించామన్నారు.
అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తో ప్రత్యేకంగా సమావేశమై జీవో నెంబర్.3 విషయంగా గిరిజనుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారని వివరించారు.
జీవో నెంబర్.3 ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కావడంతో సుప్రీం తీర్పు ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకొని సిఎం ఆదేశించారని పుష్ప శ్రీవాణి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇదే విషయంగా రాష్ట్రంలోని గిరిజన శాసనసభ్యులతో చర్చించి వారి సలహాలను కూడా తీసుకోవడానికి ఈనెల 18న రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసి) ప్రత్యేక సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.
ఈ విషయంలో గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు.