Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్

గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్
, బుధవారం, 13 నవంబరు 2019 (07:48 IST)
రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, ఐదు జిల్లాల పరిధిలో గుర్తించిన 554 గ్రామాలను ఏజెన్సీ ఏరియా పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి(టీఏసీ) సమావేశంలో తీర్మానించారు.

అలాగే అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ పోడుభూముల పట్టాలను పొందని గిరిజన రైతులకు రాబోయే ఉగాది పండుగకు లోపుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధ్యక్షతన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన టీఏసీ సమావేశంలో గిరిజన శాసనసభ్యులు, ఉన్నతాధికారులు సుధీర్ఘంగా చర్చించి గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ,ఎస్టీ కమిషన్ స్థానంలో ఎస్టీలకు ప్రత్యేకంగా కమీషన్ ఏర్పాటు చేయాలంటూ తీర్మానించారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

అలాగే రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 39 మండలాల పరిధిలో 554 గ్రామాలు కొత్తగా ఏజెన్సీ ఏరియాలోకి చేర్చడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని, వాటన్నింటినీ ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రకటించాలని సిఫార్సు చేస్తూ మరో తీర్మానాన్ని కూడా టీఏసీ ఆమోదించింది.

ఈ ప్రాంతాలన్నీ గతంలో సుమారు ముఫ్పై ఐదేళ్ల క్రితం సర్వే చేసి ఏజెన్సీలోకి చేర్చడానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన ప్రాంతాలని ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి వివరించారు. ఇవి కాకుండా కొత్త ప్రాంతాలను కూడా ఏజెన్సీ పరిధిలోకి చేర్చాలంటే మళ్లీ సర్వే జరగాలని, ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఎక్కువ సమయం కావాల్సి ఉండటంతో వాటి కోసం ఈ 554 గ్రామాల జాబితాను ఆపితే ఏజెన్సీలోకి చేర్చే ప్రక్రియ మరింత ఆలస్యమౌతుందని చెప్పారు.

అందుకే ముందుగా ఈ 554 గ్రామాలను ఏజెన్సీలోకి చేర్చే ప్రక్రియను ప్రారంభించాలని సూచించడంతో టీఏసీ సభ్యులు కూడా ఏకీభవించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో ముంపునకు గురైన ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజనులకు కొత్తగా మైదాన ప్రాంతాల్లో పునరావాసం కల్గించడం జరుగుతోందని దీనివల్ల ఏజెన్సీలో ఉండే గిరిజనులకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలను గిరిజనులు కోల్పోతున్నారని పలువురు సభ్యులు ప్రస్తావించారు.

దీంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించి పునరావాసం కలిగించిన గ్రామాలను కూడా ఏజెన్సీ పరిధిలోకి తీసుకురావడానికి అవసరమైన నిబంధనలను సడలించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించారు. అటవీ ప్రాంతాల్లో పోడువ్యవసాయం చేసుకొనే గిరిజన రైతులలో 73 వేల మందికి ఇంకా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు రావాల్సి ఉందనే అంశాన్ని కూడా చర్చించారు.

అయితే అటవీశాఖ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వడానికి సంబంధిత గిరిజన రైతులు 2005 డిసెంబర్ నాటికే ఆయా ప్రాంతాల్లో భూమిని సాగు చేస్తుండాలని నిబంధన విధించిన కారణంగానే ఎక్కువ మందికి పట్టాలు రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వడానికి పెట్టిన చివరి తేదీని 2005 డిసెంబర్ నుంచి 2008 జనవరికి పొడిగించాలని టీఏసీ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను ఇస్తుండగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను మాత్రం ఉగాది కంటే ముందుగా ఫిబ్రవరిలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం విశాఖమన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 97ను రద్దు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ టీఏసీ లో తీర్మానాన్ని ఆమోదించారు.

పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, అరకు ఎమ్మెల్యే ఫల్గుణ తదితరులు పలు అంశాలపై మాట్లాడారు.

గిరిజన అటవీ ప్రాంతాల్లో ఇతర మైనింగ్ కార్యక్రమాలను కూడా గిరిజనేతరులు కొనసాగిస్తున్నారని, వారు అడవిలోని చెట్లను నాశనం చేస్తూ, అక్కడ ఉన్న రాళ్లను, మట్టిని కూడా దోచుకుంటున్నారని పైగా ఈ మైనింగ్ ద్వారా గిరిజన గ్రామ పంచాయితీలకు ఎలాంటి రాయల్టీలు కూడా రావడం లేదని పలువురు సభ్యులు ఫిర్యాదు చేసారు.

ఈ నేపథ్యంలోనే బాక్సైట్ తోపాటుగా అటవీ ప్రాంతాల్లోని ఇతర మైనింగ్ లీజులను కూడా రద్దు చేయాలని కోరారు. దీనిపై పుష్ప శ్రీవాణి స్పందిస్తూ, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయకుండా చూడటం కోసం గతంలో ప్రత్యేకంగా ‘‘ ట్రైబల్ మైనింగ్ కార్పొరేషన్ (ట్రిమ్ కో)’’ ఉండేదని, అయితే దీన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.

ట్రిమ్ కో ను మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసిసి)లో గతంలో రెండు వేల మందికి పైగా ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 372 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని వారందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రభుత్యోద్యోగులుగా గుర్తించాలని టీఏసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా కోరారు.

ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. డివిజన్ స్థాయి పోస్టులను జీసీసీ ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా ఇవ్వాలని సిఫార్సు చేసారు. కొన్ని ప్రాంతాల్లో జీసీసీ ఆస్తులను ఐటీడీఏలు తీసుకుంటూ జీసిసికి ప్రత్యామ్నాయం చూపకుండా, ఎలాంటి ఆదాయం లేకుండా చేస్తున్నారని టీఏసీ దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏలలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ మంది కొనసాగుతూ, ఆ వ్యవస్థపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని అలాంటి వారందరినీ ఐటీడీఏల నుంచి తొలగించాలని సభ్యులు కోరారు. ఎమ్మెల్యేలుగా తమ మాట కంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల మాటే ఐటీడీఏల్లో చెలామణి అవుతోందని ఈ పరిస్థితి మారాలని కోరారు. 

ఐటీడీఏల పరిధిలోని ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీస్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఐటీడీఏల పాలక మండలి సమావేశాలు ఎప్పుడోగానీ జరగడం లేదని, అలా కాకుండా వాటిని క్రమం తప్పకుండా నిర్వహించేలా కార్యాచరణను రూపొందించాలని కూడా టీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

కాగా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అధికార సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని సభ్యులు చెప్పారు. కొందరు మంచి అధికారులను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేస్తే వారు డిప్యుటేషన్లపై మైదాన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని వాపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడమంటే పనిష్మెంటుగా భావించే పరిస్థితి ఉందన్నారు.

ఈ విషయాన్ని కూడా తాను సిఎం దృష్టికి తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని, అక్కడ పని చేసే ఉద్యోగులకు డిప్యుటేషన్లు ఇవ్వకూడదనే నిబంధన విధించాలని ముఖ్యమంత్రికి వివరిస్తానని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కృషితో గిరిజన ప్రాంతాల్లోని ఉపాధిహామీ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.65 కోట్లను మంజూరు చేసిందని ఈ సందర్భంగానే గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు.

బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసినందుకే కాకుండా, గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ మెడికల్ కాలేజ్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేసినందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలను ఆమోదించారు.

ఈ సమావేశంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, అరకు ఎమ్మెల్యే ఫల్గుణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా, కమీషనర్ రంజిత్ బాషా, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, టీసీఆర్ టిఐ డిప్యుటీ డైరెక్టర్ మందా రాణి, గురుకులం సంయుక్త కార్యదర్శి బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిన్‌లాడెన్‌ ను పట్టేశారోచ్!