చిరు వ్యాపారులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'జగనన్న తోడు' పథకం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలను చూశానని చెప్పారు.
అసంఘటిత రంగంలో ఉన్న వారికి బ్యాంకు రుణాలు కూడా అందడం లేదని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రూ. 10 వేల రుణాన్ని అందించనున్నట్టు జగన్ తెలిపారు.
బ్యాంకు అకౌంట్లు లేని వారికి అకౌంట్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఐదు అడుగులు, అంతకన్నా తక్కువ స్థలంలో ఉన్న షాపులకు... తోపుడు బండ్లపైన, ఫుట్ పాత్ లపైన, గంపల్లో వస్తువులను పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకుని తిరిగే వ్యాపారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు.
గ్రామాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేల ఆదాయం ఉండే వారు ఈ స్కీమ్ కు అర్హులని చెప్పారు. లబ్ధిదారులకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలని అన్నారు.