Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం.. నేడు 'జగనన్న తోడు' పథకం ప్రారంభం

చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం.. నేడు 'జగనన్న తోడు' పథకం ప్రారంభం
, బుధవారం, 25 నవంబరు 2020 (05:13 IST)
రోజువారీ వ్యాపారాలకు... ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చి... రోజంతా కష్టపడి సంపాధించిన సొమ్ములో... వడ్డీలకే అధిక శాతం చెల్లించే చిరువ్యాపారుల కష్టాలను తన పాదయాత్రలో వైయస్ జగన్ స్వయంగా చూశారు. చిన్నచిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను అర్థం చేసుకున్నారు. 

వారికి అండగా వుంటానంటూ ఆనాడు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ''జగనన్న తోడు'' పథకంకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని లక్షల మంది చిరు, వీధి వ్యాపారులు, హాకర్స్‌కు బ్యాంకుల ద్వారా వారికి రూ.10వేల వరకు సున్నావడ్డీ రుణాలను అందించే ప్రక్రియకు నాంది పలికారు.

బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి సుమారు రూ.1000 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తిదారులకు సీఎం వైయస్ జగన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంను వర్తింప చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్నచిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్‌, టీ స్టాల్స్, చిన్న చిన్న దుకాణదారులకు రోజువారీ తమ వ్యాపారం కోసం రోజుకు కనీసం రూ.2 నుంచి రూ.5 వేల వ‌రకు పెట్టుబడి అవసరం అవుతుంటుంది. బ్యాంకుల నుంచి ఇందుకోసం అప్పులు తెచ్చుకోలేని దీనస్థితిలో ఈ చిరు వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు.

రోజువారీ పెట్టుబడి కోసం దాదాపు 24 నుంచి 36 శాతం వరకు అధిక వడ్డీకి స్థానికంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేస్తుంటారు. వీరితో పాటు చేతివృత్తిదారులైన లేస్ వర్క్‌, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలివీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తికళాకారులు సైతం తమ ఉత్పత్తుల తయారీ కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇదే తరహాలో అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు.

ఈ పరిస్థితిని తన పాదయాత్రలో స్వయంగా చూసిన వైయస్ జగన్ వారి కష్టాలను గట్టెక్కించేందుకు 'జగనన్న తోడు' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చారు. చిరువ్యాపారులతో పాటు సంప్రదాయ వృత్తికళాకారులకు కూడా బ్యాంకుల నుంచి రూ.పదివేల వరకు సున్నావడ్డీ రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వడ్డీ భారంను ప్రభుత్వమే భరిస్తూ, చిరువ్యాపారులకు అండగా నిలిచేందుకు ముందడుగు వేశారు. 
 
జగనన్నతోడు పథకంకు ఎవరు అర్హులు అంటే....
గ్రామాలు, పట్టణాల్లో సుమారు అయిదు అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ల పైన, పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహారపదార్ధాలు, చేనేత, హస్తకళా వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నవారు.

నెత్తిమీద గంపలో వస్తువులు మోస్తూ, అమ్ముకునే పేదవారు.  సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు. సంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కళంకారీ కళాకారులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామగ్రి తయారీదారులు. వ్యాపారి వయస్సు 18ఏళ్లు నిండి వుండాలి. ఆధార్, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి వుండాలి.

సంప్రదాయ ముడిపదార్ధాలతో లేస్ వర్క్‌, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, బొబ్బొలి వీణలు, కంచు కళాకృతులు రూపొందించే చేతివృత్తి కళాకారులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
 
ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారు...
గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలు వున్న వ్యక్తులు ఈ జాబితాలో తమ పేరు లేనిపక్షంలో వెంటనే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకానికి అర్హులై ఉండి బ్యాంకు ఖాతా లేనివారికి కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వాలంటీర్ల ద్వారా తోడ్పాటును అందిస్తారు. అర్హులైన వారి దరఖాస్తులను గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్‌ ద్వారా సంబంధిత బ్యాంకులకు పంపుతారు. 
 
బ్యాంకులతో సమన్వయం కోసం ప్రత్యేక పోర్టల్...
బ్యాంకులతో సమన్వయం చేసుకోవడం, పటిష్టంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. బ్యాంకులు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారుడి అవసరాన్ని బట్టి రూ.10వేల వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంకులో లోన్‌ అకౌంట్‌ను తెరిచిన లబ్దిదారుడికి మూడు నుంచి నాలుగు రోజుల్లో రుణం మొత్తాన్ని జమ చేస్తారు.

ఎంపికైన లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులను అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సెర్ఫ్, మెప్మాలు సమన్వయంతో ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణంను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తరువాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రియాంబర్స్‌ చేస్తుంది. 
 
నిరంతరం ఎంపిక ప్రక్రియ...
ఎవరైనా పొరపాటున ఈ పథకం కింద అర్హులు మిగిలిపోతే, గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించి, గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోపు సదరు దరఖాస్తును పరిశీలించి వారికి కూడా రుణాలను అందించనున్నారు.

అలాగే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం ద్వారా మరింత మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇంకా ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా వారు చేసే వ్యాపారంను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హతను బట్టి రుణాలు అందిస్తారు. 
 
జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు:
----------------------------------------------
జిల్లాలు లబ్ధిదారులు రుణం (రూ.కోట్లలో)
-----------------------------------------------
అనంతపురం 66150 66.15
చిత్తూరు 74994 74.95
తూ.గో.జిల్లా 90979 90.98
గుంటూరు 97530 97.53
కృష్ణా 53870 53.87
గుంటూరు 97530 97.53
ప్రకాశం 75416 75.42
నెల్లూరు 60867 60.87
శ్రీకాకుళం 42238 42.24
విశాఖ 87527 87.53
విజయనగరం 41269 41.27
-------------------------------------------------------------
 
వృత్తుల వారీగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు:
-------------------------------------------------------
కూరగాయల వ్యాపారులు - 1,44,486
కిరాణ షాప్ - 1,24,735
టిఫిన్ షాప్ - 85,330
బడ్డీకొట్టు - 55,202
ఫ్యాన్సీ షాప్ - 26,024
గ్రీన్ - 18,484
మగ్గం వర్క్‌ - 17,637
క్లాత్ అండ్ హ్యాండ్‌లూమ్స్ - 15,052
లేస్‌ వర్క్‌ - 10,231
స్టీల్ వేర్ - 8,298
కుమ్మరి, కుండల తయారీ - 4,767
కిచన్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ - 4250
బ్యూటీ అండ్ ఫ్యాషన్ - 1773
బ్రాస్‌ వేర్ - 1052
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ - 810
కళంకారీ - 734
ఏటికొప్పాక బొమ్మలు - 467
తోలుబొమ్మలు - 458
కొండపల్లి బొమ్మలు - 301
బొబ్బిలి వీణ - 39
ఇతరులు - 3,16,505

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భవతితో వివాహేతర సంబంధం, నమ్మించి తీసుకెళ్లి ఆ పని చేసాడు