Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 జిల్లాలను పర్యాటకపరంగా సమాంతరంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి శ్రీనివాస్

Advertiesment
13 జిల్లాలను పర్యాటకపరంగా సమాంతరంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి శ్రీనివాస్
, శనివారం, 18 జనవరి 2020 (21:04 IST)
గ‌త ఏడాది సెప్టెంబరు 15న గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసిన పర్యాటక బోట్‌లను పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున కసరత్తు చేసి బోలకు అనుమతి ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అధికారులతో పాటు పర్యాటకులు, బోటు యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని అన్నారు.

బోట్లలో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని, డ్రింక్స్‌ను పూర్తిగా నిషేధించామని, కమాండ్ కంట్రోల్ అనుమతి పొందిన తర్వాతే బోటు టూరుకు బయలుదేరాలని మంత్రి చెప్పారు. పర్యాటకుల భద్రతే ప్రధమ ధ్యేయమని మంత్రి తెలిపారు.

శనివారం పున్నమిఘాట్‌లోని బ‌రం పార్క్‌లో పర్యాటక బోట్లను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు, యం.జగన్మోహనరావు, స్థానిక నాయకులు బొప్పన భవకుమార్, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కె.ప్రవీణ్‌కుమార్, టూరిజం యండి ప్రవీణ్‌కుమార్ తదితరులతో కలిసి పర్యాటక బోటింగ్‌ను మంత్రి అవంతి శ్రీనివాస్ పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబరు 15న గోదావరి నదిలో దురదృష్టకరమైన పడవ ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే సెప్టెంబరు 16న ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన రెడ్డి ప్రమాద ప్రాంతాన్ని సందర్శించడం, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడంతోపాటు పడవ ప్రమాదంపై సమీక్షించడం జరిగిందన్నారు.

సురక్షితమైన విధానాలకు, భద్రతకు, మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారని, అందుకు సంబంధించి నియమనిబంధనలను రూపొందించేందుకు ఆరుగురుతో ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసారన్నారు. కాకినాడ పోర్టు పరిధిలో 19, మచిలీపట్నం పోర్టు పరిధిలో 90 స్పీడ్ బోట్లు ఉన్నాయన్నారు.

వాటిలో 26 బోట్లను పరిశీలించి తగిన సిఫాస్టు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలోని సిఫాస్ట్లను పరిగణన లోనికి తీసుకోవడం, అందుకు అనుగుణంగానే అనుమతులు తేవడం జరుగుతుందన్నారు.

12 సీటింగ్ కెపాసిటి కలిగిన బోట్లకు కాకినాడ, మచిలీపట్నం పోర్టు ఆఫీసర్ల ఆధ్వర్యంలో 15 ఏపి టిడిసి పడవలకు, ఒక ప్రైవేట్ పడవకు యఓసి ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. భవాని ఐల్యాండ్ ప్రాంతాన్ని కూడా మరమ్మతులు చేసి మరో వారం రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్లు చెప్పారు.

ఇందుకోసం ఒక రూ.1.9 కోట్ల అంచనావ్యయంతో పనులను చేపట్టడం జరిగిందని, వీటిలో ఇప్పటికే సుమారు 60 శాతం వరకు పనులు పూర్తి చేశామన్నారు. పర్యాటకులకు సురక్షితమైన బోట్ ప్రయాణం అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, తదితర శాఖలకు చెందిన అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఫిబ్రవరి 20 నాటికల్లా పూర్తి స్థాయిలో వీటిని అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. సుశిక్షితమైన డ్రైవర్లను బోటింగ్ కోసం వినియోగించడం జరుగుతుందన్నారు. గజఈతగాళ్లను, సాంకేతిక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం జిఓ నెంబరు 10, తేది 17.01.2020 న స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

బోటు ప్రయాణం సమయంలో లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని ఇందుకు సంబంధించి పర్యాటకులకు సరిపడే భద్రతా పరికరాలు అందుబాటులోకి ఉన్నప్పుడే వాటిని తిప్పేందుకు అనుమతిస్తామన్నారు. మనిషి శక్తి కంటే ప్రకృతి శక్తి అంచనాకు అందదని, గత పది సంవత్సరాల్లో ఎన్నడు లేనివిధంగా ఈ ఆరు నెలల వ్యవధిలోనే పలుమార్లు వరదలు వచ్చాయన్నారు.

పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. శిక్షణ విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతోందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చట్టాల పట్ల ప్రజల నుంచి మార్పురావాలని, ప్రభుత్వంతో పాటు ప్రజలు, మీడియా కూడా భాగస్వామ్యం అయినప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సముద్ర, నది, అడవులు, ప్రకృతి సంబంధమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు మొదలైన ప్రాంతాలలో రాబోయే దశాబ్దకాలంలో పర్యాటకపరంగా గణనీయమైన అభివృద్ధిని సాధించగలుగుతామని మంత్రి పేర్కొన్నారు. గతంలో లాగా ఒక వర్గానికో, ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాలను పర్యాటకపరంగా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వం ఆర్ధికంగా లోటులో ఉన్నప్పటికీ 22 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్లు నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేసారన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

పున్నమిఘాట్ నుండి భవాని ఐల్యాండ్ కు త్వరలోనే బోటింగ్ అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందన్నారు. కుటుంబసమేతంగా తప్పనిసరిగా ఈప్రాంతాన్ని సందర్శించాలని ఆయన తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధనరావు మాట్లాడుతూ.. పర్యాటకులకు భద్రత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

పర్యాటకరంగం ఏ విధంగా ఉండాలన్న అంశంపై ఉన్నతాధికారులతో కమిటీని వేయడం జరిగిందన్నారు. భవాని ఐల్యాండ్ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉంచేలాగా రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరుగుతున్నదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పర్యాటకులకు భద్రత లేకుండా చేసిందన్నారు.

నందిగామ శాసనసభ్యులు జగన్మోహనరావు మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకుల భద్రతకు తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగ జేయడం జరుగుతుందన్నారు.

అనంతరం మంత్రి అధికారులతో కలిసి భవాని ఐల్యాండ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టూరిజం జనరల్ మేనేజర్‌ సుదర్శనరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ సత్యనారాయణ, పలువురు టూరిజం అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో సి. రాఘవాచారి పేరుతో పార్కు