ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యర్థాల సేకరణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఈ నెల 15 నుంచి 16 నగరపాలక సంస్థలు, 29 స్పెషల్, సెలక్షన్, ఫస్ట్‌గ్రేడ్ పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. తర్వాత క్రమంగా దీనిని విస్తరిస్తారు.
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల సేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్లాప్ అమలు కోసం ఇప్పటి వరకు పాలకవర్గం అనుమతి తీసుకోని చోట వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కోచోట, ఒక్కో విధంగా వినియోగ రుసుములు వసూలు చేయనున్నారు.
గృహాలకు అయితే నెలకు రూ.120, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే రూ.1,500, బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.3 వేలు, ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటళ్ల నుంచి రూ.15 వేలు, పండ్ల దుకాణాల నుంచి రూ.200, ఫంక్షన్ హాళ్ల నుంచి రూ.4-15 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రూ.750-10 వేలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రూ.500-3 వేలు, చికెన్, మటన్ దుకాణాల నుంచి రూ.300 వసూలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.