విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమిస్తున్నానని వేధించడమే కాకుండా యువతితో పాటు ఆమె తల్లిపై కూడా ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళితే... మధురవాడ పోలీస్ స్టేషన్, స్వయంకృషి నగర్‌లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడ్డాయి. యువతితో పాటు ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు.
ఈ ఘటనలో తల్లి లక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీపిక డిగ్రీ చదువుకుని ఇంట్లోనే వుంటోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు మంత్రి ఆదేశించారు.